బాబోయ్.. బోగస్ ఉద్యోగులు
హుస్నాబాద్‌రూరల్: గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో బోగస్ ఉద్యోగులు హల్‌చల్ చేస్తున్నారు. విధులకు రాకుండానే రూ.లక్షల వేతనాలను పొందుతున్నారు. ఔట్ సోర్సింగ్ ముసుగులో లెక్కకు మించి నియామకాలు చేపట్టినట్లు వినికిడి. నెలల తరబడి విధులకు రాకపోయినా వేతనాలు ఎట్లా చెల్లిస్తారని తోటి ఉద్యోగులు సైతం ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని రెండు గిరిజన ఆశ్రమ పాఠశాలలు, నాలుగు పోస్టు మెట్రిక్ వసతి గృహాలు ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హాస్టల్ సౌకర్యం ఉన్న పిల్లల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతూ వస్తుంది.
ఉపాధ్యాయుల నియామకాలు
పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేదా సబ్జెక్టు ఒక ఉపాధ్యాయుడిని నియమించాల్సి ఉంది. 3, 4, 5 తరగతులకు ముగ్గురు ఎస్జీటీలు, ఉన్నత పాఠశాలకు సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. కానీ మీర్జాపూర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో తెలుగు బోధనకు గ్రేడు–1, గ్రేడు–2 ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట గ్రేడు–2 పోస్టు ఖాళీగా ఉండటంతో దానిని అధికారులు బ్లాక్‌లో పెట్టడంతో అ పోస్టు ఖాళీగానే ఉంది. మీర్జాపూర్ ఆశ్రమ పాఠశాలలో 2024 ఏప్రిల్ 23 వరకు సీఆర్టీ (కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్) హిందీ టీచరు పని చేయగా, ఈ పాఠశాలకు జయశంకర్ భూపాలపల్లి మేడిపల్లి నుంచి రెగ్యులర్ హిందీ టీచరు బదిలీపై వచ్చి విధుల్లో చేరారు. దీంతో సీఆర్‌టీ హిందీ టీచరును తొలగిస్తూ అప్పటి డీటీడబ్ల్యూఓ ఉత్తర్వులు జారీ చేశారు. సెలవుల అనంతరం సీఆర్‌టీని మళ్లీ విధుల్లోకి తీసుకుంటూ డీటీడబ్ల్యూఓ జూన్ 12న ఉత్తర్వులు ఇస్తూ హుస్నాబాద్ ఆశ్రమ పాఠశాలకు పోస్టింగ్ ఇచ్చారు. అప్పటికే హుస్నాబాద్ ఆశ్రమ పాఠశాలలో రెగ్యులర్ హింది టీచరు ఉండగా మళ్లీ సీఆర్‌టీ హిందీ టీచరు ఎందుకు అని ఇటీవల డీటీడబ్ల్యూఓ లీల పాఠశాలను తనిఖీ చేసి ప్రిన్సిపాల్ ప్రశ్నించారు. మీర్జాపూర్‌లో అవసరం ఉన్న తెలుగు పోస్టును బ్లాక్‌లో పెట్టి అవసరం లేని హిందీ పోస్టు కొత్తగా సృష్టించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అర్హత లేని వారికి..
జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో అవసరానికి మించి స్కావెంజర్లను, వైద్య సిబ్బందిని పైరవీలతో నియమిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగునంగా ఉద్యోగులను నియమించుకోవాలి. ఔట్ సోర్సింగ్ ద్వారా నియామకం చేయాలంటే సరైన విద్యార్హతలు ఉన్న అభ్యర్థులనే విధుల్లోకి తీసుకోవాలి. హాస్టల్‌లో వైద్య సిబ్బందికి సరైన విద్యార్హతలు లేకపోయినా రాజకీయ పలుకుబడితో నియమిస్తున్నారు. దీంతో వారు విధులకు గైర్హాజరైనా హాజరు వేస్తున్నారని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. అంతర్గత విభేదాలతో ఒకరిపై ఒకరు డీటీడబ్ల్యూఓకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మిగతా ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బోగస్ ఉద్యోగుల పై విచారణ జరిపించి విధుల నుంచి తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఔట్ సోర్సింగ్ ముసుగులో నియామకాలు
గిరిజన ఆశ్రమాల్లో నకిలీ బాగోతం
విధులకు రాకుండానే రూ.లక్షల వేతనాల చెల్లింపులు
విచారణ చేపట్టి తొలగించాలని సర్వత్రా డిమాండ్
మా దృష్టికి వచ్చింది
ఇటీవల ఓ పాఠశాలను తనిఖీ చేయగా రెగ్యులర్ హిందీ టీచరుతోపాటు సీఆర్‌టీ ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. సరెండర్ చేయాలని చెప్పాను. గత డీటీడబ్ల్యూఓ హిందీ టీచరు ఉండగా మరో సీఆర్‌టీ పోస్టు ఇచ్చారు. విధులకు హాజరు కాని ఉద్యోగులపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం.
– లీల, డీటీడబ్ల్యూఓ, మెదక్


