గుడులు టార్గెట్‌గా వరుస చోరీలు
వర్గల్(గజ్వేల్): దేవాలయాలు టార్గెట్‌గా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులు వర్గల్ మండలం గౌరారం పోలీసులకు చిక్కారు. అందులో ఒకరు మైనరు. వీరితోపాటు దొంగ సామగ్రి కొనుగోలు చేసిన మరొక వ్యక్తిని కూడా రిమాండ్‌కు తరలించారు. వివరాలను బుధవారం గజ్వేల్ ఏసీపీ నర్సింహులు గౌరారం రూరల్ సర్కిల్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. కొన్నిరోజులుగా గజ్వేల్ డివిజన్ పరిధిలోని గుడులలో దొంగతనాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి గౌరారం, రాయపోల్ పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు చేస్తున్న గౌరారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి పలుచోట్ల పకడ్బందీ నిఘా వేశారు. అతనికి వర్గల్ కల్లుదుకాణంలో నిందితులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకుని గజ్వేల్‌కు చెందిన పర్వతం నర్సింహులు(35), తూర్పాటి వంశీ (20), కొల్గూరుకు చెందిన బాలుడు(15)ని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరితోపాటు దొంగ సామగ్రి కొనుగోలు చేసిన వర్గల్‌కు చెందిన కూరాకుల ఆంజనేయులు(30)ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో పర్వతం నర్సింహులుపై తొమ్మిది కేసులుండగా చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. తూర్పాటి వంశీపై రెండు కేసులు, బాలుడిపై మూడు కేసులున్నాయి.
తాజా చోరీలు ఇలా..
పాత నేరస్తులైన వీరు ఇటీవల రాయపోల్ మండలం వీరానగర్ గ్రామ వీరప్పస్వామి గుడిలో చోరీకి పాల్పడ్డారు. ములుగు మండలం తునికి బొల్లారంలో ఇంటి ముందు నుంచి టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్ అపహరించారు. వర్గల్ మండలం శాకారం పెద్దమ్మ గుడి, రాయపోల్ మండలం లింగారెడ్డిపల్లి పెద్దమ్మ గుడి, అనాజిపూర్ పెద్దమ్మ గుడి, గొల్లపల్లి గ్రామ పెద్దమ్మ గుడి, వర్గల్ మండలం తున్కిఖాల్సాలోని ఎల్లమ్మ దేవాలయం, ఉమా లింగేశ్వరాలయంలో హుండీ ధ్వంసం చేశారు. వేలూరు పెద్దమ్మ గుడి తాళాలు పగులకొట్టారు. ఆయా గుడులలో గంటలు, ఇత్తడి ప్లేట్, మణిక్యాలు, ఇతర వస్తువులు దొంగిలించారు. వాటిని వర్గల్‌కు చెందిన కూరాకుల ఆంజనేయులుకు విక్రయించి, వచ్చిన డబ్బును సమానంగా పంచుకున్నారు. బుధవారం వీరిని అదుపులోకి తీసుకుని టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్, రెండు గుడిగంటలు, ఒక ఇత్తడి ప్లేటు, రెండు ఇత్తడి మాణిక్యాలు, రాగి చెంబు, నాలుగు మోబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి, గౌరారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి ఉన్నారు.
గౌరారం పోలీసులకు చిక్కిన నిందితులు
మైనర్ బాలుడు సహా నలుగురు రిమాండ్
వివరాలు వెల్లడించిన గజ్వేల్ ఏసీపీ నర్సింహులు


