ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో జీవితాలు నాశనం
కానిస్టేబుల్ ఆత్మహత్యపై హైదరాబాద్ సీపీ సజ్జనార్
సంగారెడ్డి క్రైమ్: ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో జీవితాలను నాశనం చేసుకోవద్దని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. ఈనెల 3వ తేదీన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలానికి చెందిన కానిస్టేబుల్ కొఠారి సందీప్ కుమార్(23) ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించేవాడు. 23 ఏళ్ల వయసులోనే ఉద్యోగం సాధించిన సందీప్.. ఆన్‌లైన్ గేమ్‌లతో అప్పుల పాలై ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పోలీసు ఉద్యోగి ఇలాంటి వ్యసనానికి అలవాటు పడి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రమాదకరమని, అది తమ జీవితాలతో పాటు కుటుంబ సభ్యుల జీవితాన్ని కూడా నాశనం చేస్తుందని హెచ్చరించారు. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని, ఆత్మహత్య పరిష్కారం కాదని ఆయన సూచించారు.
జహీరాబాద్ టౌన్: మొగుడంపల్లి మండలం సజ్జరావుపేట తండాలో గుడుంబా విక్రహిస్తున్న ఇద్దరిని ఎకై ్సజ్ పోలీసులు అరెస్టు చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు జహీరాబాద్ ఎకై ్సజ్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. నాటు సారా విక్రయిస్తున్న జాదవ్ గున్యా, రాథోడ్, గోవింద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 4.5 లీటర్ల గుడుండా స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
సిద్దిపేటరూరల్: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సిద్దిపేట మండల పరిధిలోని మాచాపూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. రూరల్ ఏఎస్‌ఐ కిష్టయ్య కథనం మేరకు. దుబ్బాక రూరల్ మండలం బల్వంతాపూర్‌కు చెందిన జంగిటి రాజు (33) మాచాపూర్ గ్రామ శివారులోని ఓ పౌల్ట్రీఫాంను లీజుకు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో కోడిపిల్లలకు దాన పెట్టేందుకు పౌల్ట్రీఫామ్‌కు వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత భార్య రాజుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. ఆందోళనకు గురైన వెంటనే ఆమె అక్కడికి వెళ్లి చూడగా అక్కడే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కిందపడి పోయి ఉండటాన్ని గమనించింది. భర్తను ముట్టుకోగా తనకు కూడా షాక్ తగిలింది. దీంతో అప్రమత్తమై రాజు షర్ట్‌ను పట్టి పక్కకు లాగి అరవడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. చేతికి కరెంట్ షాక్ తగిలి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సంగారెడ్డి క్రైమ్: ఓ హాస్టల్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. పట్టణంలోని రాజంపేట్‌కు చెందిన తలారి సుధాకర్ కుమారుడు తలారి నిక్సాన్ (12), స్దానిక సంక్షేమ హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ బాలుర పాఠశాలల్లో 6వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం హాస్టల్ నుంచి పాఠశాలకు వెళ్లిన విద్యార్ది సాయంత్రం తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకి తెలిస్తే 87126 61830 నంబర్లకు తెలియజేయాలని సీఐ కోరారు.


