ఉపాధి చర్చించి.. గుర్తించి
ప్రజలు, రైతులు కోరుకున్న పనులకు ప్రాధాన్యతనిస్తూ వారి సూచన మేరకు వచ్చే ఆర్థిక ఏడాది 2026–2027కి గానూ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనులను గ్రామ సభల ద్వారా అధికారులు గుర్తిస్తున్నారు. అక్టోబర్ 1నుంచి ప్రారంభమైన ఉపాధి హామీపనుల గుర్తింపు ఈ నెలాఖరువరకు కొనసాగనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈసారి రైతులకు మరింత మేలుజరిగే పనులకు ఉపాధి హామీలో అధిక ప్రాధాన్యతనివ్వనున్నారు.
మెదక్‌జోన్:
మెదక్ జిల్లా వ్యాప్తంగా 1.62 లక్షల జాబ్‌కార్డులు ఉండగా 3.60 లక్షల మంది కూలీలున్నారు. ప్రస్తుతం 90 వేల పైచిలుకు కూలీలు నిత్యం పనులు చేస్తున్నారు. ఈసారి ఉపాధి హామీలో వేటికి ప్రాధాన్యతనివ్వాలని గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోని ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు పల్లెల్లో గ్రామసభలు నిర్వహించి పనులను ఎంపిక చేస్తున్నారు. ఈ గ్రామసభల్లో ఎటువంటి పనులతో ప్రజలకు మేలు చేకూరుతుందో వాటిని చర్చించి నోట్ చేసుకుంటారు. వాటిని అక్కడికక్కడే చర్చించి ప్రజలకు వినిపిస్తున్నారు. ప్రజలందరి అంగీకారం లభించాకే ఆ పనులకు తుదిజాబితాలో చేరుస్తున్నారు. ఆ పనుల తుదిజాబితాను ఇంజనీరింగ్‌శాఖ అధికారులకు అందిస్తారు. ఇంజనీరింగ్ అధికారులు ఆ పనులకయ్యే మొత్తం ఖర్చును అంచనా వేస్తారు. ఒక్కో జాబ్‌కార్డుకు వంద రోజుల పనికల్పించేలా లెక్కలు వేసి వాటిని జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తారు. ఆ నివేదికను జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి పంపిస్తే అనుమతి లభించాక ఆ పనులను కూలీలతో చేయిస్తారు.
భూగర్భజలాలు,
పండ్లతోటలకు ప్రాధాన్యత
ఈసారి ఉపాధిహామీలో రైతులకు మేలుజరిగే పనులకు అధిక ప్రాధాన్యతనివ్వనున్నారు. ప్రధానంగా భూ గర్భజలాల పెంపునకు నీటికుంటల తవ్వకం, పాంఫండ్స్, చిన్నపాటి చెరువుల తవ్వకం, ఫిష్‌ప్లాంట్స్, గొర్రెలు, పశువుల కోసం పాకలు(కొట్టాలు) బోర్‌వెల్ రీచార్జీలు, చెరువుల్లో పూడికతీత, జామ, నిమ్మ, బొప్పాయి, మామిడి, అరటి తదితర పండ్లతోటల పెంపకం, నర్సరీలు, రైతులు పంట పొలాల వద్దకు వెళ్లేందుకు మట్టిరోడ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ పనులను గుర్తిస్తున్నారు.
40% మెటీరియల్ పనులు
జిల్లాలో ప్రతీ కుటుంబానికి 100 రోజుల పనికల్పించేందుకు జాబ్‌కార్డుల ఆధారంగా గ్రామాల్లో పనులను గుర్తించి ఆ నివేదికను ప్రభుత్వానికి పంపుతారు. ఆ పనులకయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకుని, కూలీలకు చెల్లించే మొత్తాన్ని లెక్కించి అందుకు అదనంగా 40% నిధులను జిల్లాకు కేటాయిస్తారు. ఆ నిధులతో పల్లెల్లో సీసీరోడ్ల నిర్మాణాలు, గ్రామ పంచాయితీ భవన నిర్మాణాలు, ఇతర మెటీరియల్ పనులకోసం కేంద్రం మంజూరు చేస్తుంది. కాగా, అధికారులు ముందుగా కూలీలతో చేసే పనులను మాత్రమే గుర్తిస్తున్నారు.
ప్రజాభిప్రాయసేకరణలో అధికారులు
ఈనెలాఖరు వరకు కొనసాగింపు
భూగర్భజలాలు, పండ్లతోటలపెంపునకు ప్రాధాన్యత
100 రోజుల పనికల్పించటమేలక్ష్యంగా..


