11న కలెక్టరేట్ వద్ద దీక్ష
బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్
సంగారెడ్డి: బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదని సంగారెడ్డి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ ప్రభు గౌడ్ పేర్కొన్నారు. సంగారెడ్డిలో బుధవారం ప్రభుగౌడ్ అధ్యక్షతన జరిగిన బీసీ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ఈనెల 11న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు. ఈ దీక్షకు జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులందరూ హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ, కుమ్మరి సాయిలు, వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర, కన్వీనర్ పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, బీసీ సంక్షేమ సంఘం కార్మిక విభాగం అధ్యక్షుడు జి సుదర్శన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి జోనల్‌క్రీడలు ప్రారంభం
హత్నూర(సంగారెడ్డి): మండల కేంద్రమైన హత్నూర డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో ఈనెల 6 నుంచి నిర్వహించే జోనల్ క్రీడల సందర్భంగా బుధవారం జిన్నారం సీఐ రమణారెడ్డి క్రీడా మైదానాన్ని పరిశీలించారు. హత్నూర గురుకుల కళాశాలలో నిర్వహించే 11 వ జోనల్ క్రీడలను పకడ్బందీగా నిర్వహించాలని ఇప్పటికే గురుకుల విద్యాలయం రాష్ట్రస్థాయి అధికారులు క్రీడా మైదానాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 6 నుంచి 8 వరకు 11వ జోన్ మీట్ క్రీడలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. జోన్ (ఏ) పరిధిలోని 11 పాఠశాల క్రీడాకారులకు హత్నూర గురుకుల కళాశాల జోనల్‌స్థాయి క్రీడా పోటీల నిర్వహించనున్నారు. ఈ క్రీడల ప్రారంభోత్సవానికి ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డితోపాటు గురుకుల విద్యాసంస్థల రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా అధికారులు హాజరుకానున్నట్లు కళాశాల పీడీ గణపతి తెలిపారు.
రేవంత్ వ్యాఖ్యలు సరికాదు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్
నర్సాపూర్: ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ ధ్వజమెత్తారు. విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడుతూ...హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం తమ పార్టీతో పాటు ప్రధానిపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అబద్ధాలు చెప్పి, అమలు కాని హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రిపై విమర్శలు చేయడం విచారకరమని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతుల్లేక, వడ్లను సకాలంలో తూకం వేయనందున రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆరోపించారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేశ్, ఇతర నాయకులు నారాయణరెడ్డి, బాల్‌రాజ్,శంకర్, రాజు, కృష్ణ పాల్గొన్నారు.
సీసీఐలో కొనుగోళ్లు బంద్
మునిపల్లి(అందోల్): కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లు చేయడాన్ని నిరసిస్తూ మునిపల్లి, రాయికోడ్ మండలాల్లోని సీసీఐలో పత్తి కొనుగోళ్లను నిలిపి వేశారు. ఈ మేరకు రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు. రైతులకు ఉపయోగపడే విధంగా పాత పద్ధతిలోనే పత్తి కొనుగోళ్లు చేయాలని సీసీఐ అధికారులను డిమాండ్ చేశారు.
పేరుకుపోతున్న వడ్లకుప్పలు
నర్సాపూర్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో తూకం వేయనందున చాలా కేంద్రాల్లో వడ్ల కుప్పలుగా పేరుకుపోతున్నాయి. కొనుగోలు కేంద్రాలకు రైతులు తెస్తున్న వడ్లు ఎండపెట్టి తూకానికి సిద్ధం చేస్తున్నారు. కాగా, చాలా కొనుగోలు కేంద్రాల్లో తూకం పనులు నత్తనడకన సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. వడ్లను తేమ లేకుండా ఎండపెట్టినా తూకం వేయకపోవడంతో తాము రోజూ కొనుగోలు కేంద్రాలలో తూకం కోసం ఎదురు చూడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఆయా కేంద్రాల్లో తూకం పనులు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.
11న కలెక్టరేట్ వద్ద దీక్ష


