ప్రయాస్‌కు లచ్చపేట మోడల్ విద్యార్థులు
దుబ్బాకటౌన్: ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రయాస్–2025 (ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ ఆటీట్యూడ్ ఇన్ యంగ్ అండ్ అస్పైరింగ్ స్టూడెంట్స్)కు నిర్వహించిన నూతన ఆవిష్కరణకు దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మెడల్ స్కూల్ విద్యార్థులు ఎంపికై నట్లు ఎంఈఓ జోగు ప్రభుదాస్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ..విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణల నైపుణ్యాన్ని పెంపొందిచేందుకు ప్రతీ ఏటా ఎన్సీఆర్టీ –న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ప్రయాస్ పేరుతో పోటీలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు మహ్మద్ అజీజ్ , శివ కుమార్ రైతులకు ఉపయోగపడే కొత్త యంత్ర నమూనా పరికరాన్ని ( ఆటోమేటిక్ ఫర్టిలైజర్ డిస్పెన్సర్ సిస్టమ్)ను ఆవిష్కరించారన్నారు. ఈ పోటీట్లో దేశ స్థాయిలో 35 పాఠశాలలు ఎంపికయ్యాయని తెలిపారు. తెలంగాణ నుంచి ప్రభుత్వ పాఠశాలల విభాగంలో కేవలం లచ్చపేట మోడల్ స్కూల్ ఎంపికవడం సంతోషంగా ఉందన్నారు. రైతులకు ఉపయోగపడే యంత్ర తయారీలో విద్యార్థులను ప్రోత్సహించిన గైడ్ టీచర్ జ్యోతి, ప్రిన్సిపాల్ బుచ్చిబాబు, విద్యార్థులను జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కాగా త్వరలో విద్యార్థులు రూ.50 వేల పారితోషికంతో పాటు సర్టిఫికెట్ అందుకోనున్నట్లు ఎంఈఓ తెలిపారు.


