గొర్రెలపైకి దూసుకెళ్లిన బస్సు
కొల్చారం(నర్సాపూర్): ఆర్టీసీ బస్సు గొర్రెల మందపైకి దూసుకెళ్లడంతో 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామానికి చెందిన కురుమ నరసింహులుకు చెందిన గొర్రెలను కాపరులు కౌడిపల్లి నుంచి ఏడుపాయలకు మేత కోసం తోలుకెళ్తున్నారు. ఈ క్రమంలో నర్సాపూర్ వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు కొల్చారం సమీపంలోని చిన్న గుప్పటి కల్వర్టు వద్ద గొర్రెల మందపైకి అతివేగంగా వచ్చి దూసుకెళ్లింది. దీంతో 30 గొర్రెలు మృతి చెందాయి. గమనించిన కాపరి అంజప్ప డ్రైవర్‌కు ఆపమని చెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదని, తనకు తృటిలో ప్రమాదం తప్పిందని తెలిపాడు. ఇదే సమయంలో వెనకవైపు నుంచి వస్తున్న డీసీఎం రోడ్డుపై చచ్చిపడి ఉన్న గొర్రెలను చూసి తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న సైడ్ రెయిలింగ్‌కు ఢీకొట్టి అక్కడే ఆగిపోయింది. కాపరి అంజప్ప మాట్లాడుతూ ఒక్కో గొర్రె విలువ రూ.15 వేల వరకు ఉంటుందని, లక్షల్లో నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసులు స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేశారు.
ప్రమాదంలో 30 గొర్రెలు మృత్యువాత మెదక్ జిల్లాలో ఘటన


