మానవత్వం చాటుకున్న ఆటో డ్రైవర్
పటాన్‌చెరు టౌన్: ఆటోలో మర్చిపోయిన బ్యాగును ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో బాధితురాలికి అందజేశారు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసుల వివరాల ప్రకారం... పటాన్‌చెరు బస్టాండ్ వద్ద మధులత అనే మహిళ ఆటో ఎక్కి రామచంద్రాపురం జ్యోతినగర్‌లో దిగింది. ఈ సమయంలో రూ.15 వేల నగదు, 15 తులాల బంగారం ఉన్న బ్యాగ్‌ను ఆటోలో మరిచిపోయింది. వెంటనే రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ ప్రేమానంద్ ఆటోలో ఓ మహిళ బ్యాగును మరిచిపోయి దిగిందని, పటాన్‌చెరు ట్రాఫిక్ ఎస్‌ఐ నాగేశ్వరరావుకు అప్పగించాడు. వెంటనే బాధితురాలు ముధులతను పిలిపించి బ్యాగును అందజేశారు. అనంతరం ఆటో డ్రైవర్‌ను ట్రాఫిక్ పోలీసులు అభినందించారు. ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్స్ వి.శంకర్, మధుసూదన్ గౌడ్, ఆటో స్టాండ్ ఉపాధ్యక్షులు చోటు బాయి, ఎండీ సాధిక్ పాల్గొన్నారు.
మరో ఘటనలో..
రామచంద్రాపురం(పటాన్‌చెరు): సంగారెడ్డి ప్రాంతానికి చెందిన హర్షిని చౌదరి ఆదివారం రాత్రి పటాన్‌చెరులో ఆటో ఎక్కి బీరంగూడ కమాన్ వద్ద దిగే సమయంలో బ్యాగ్‌ను మరిచిపోయింది. ఆ బ్యాగులో కిలో వెండి వస్తువులు, రూ.2,600నగదు ఉన్నాయని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్ షకీల్ సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఆటోను గుర్తించి బాధితురాలికి బ్యాగ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌ను మియాపూర్ ఏసీపీ సీ.హెచ్. శ్రీనివాస్ అభినందించారు.
మర్చిపోయిన బ్యాగు
బాధితురాలికి అప్పగింత


