నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి
టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల
కొండాపూర్(సంగారెడ్డి): నాణ్యమైన విత్తనాలతోనే పంటల్లో అధిక దిగుబడులు వస్తాయని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల అన్నారు. సోమవారం మండల పరిధిలోని తొగర్‌పల్లిలో పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నాణ్యమైన విత్తనం– రైతన్నకు నేస్తం’ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. గతంలో రైతులు పండించిన పంటలనే విత్తన శుద్ధి చేసుకొని తిరిగి వాటినే విత్తనాలు నాటేవారన్నారు. కానీ ప్రస్తుతం పండించిన పంటను మొత్తం అమ్ముకొని తిరిగి విత్తనాల కోసం మార్కెట్‌లో క్యూ కట్టే పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి రైతులను గట్టించేందుకు ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు ప్రతి గ్రామంలో ముగ్గురికి చొప్పున విత్తనాలను పంపిణీ చేశారని తెలిపారు. విత్తనాలు తీసుకున్న వారు తమ పంటలను బహిరంగ మార్కెట్‌లో అమ్మకుండా నేరుగా రైతులకు విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల రీసెర్చ్ స్కాలర్ బలరాం, జెడీఏ శివప్రసాద్, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్లు శ్రీకాంత్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, రాంరెడ్డి, పవన్‌కుమార్, ఏఓ గణేష్‌తో పాటు వ్యవసాయాఽధికారులు పాల్గొన్నారు.
రూ.1.30 కోట్ల నిధులివ్వండి
కలెక్టర్‌కు నిర్మలారెడ్డి వినతి
సంగారెడ్డి: ప్రభుత్వ బాలుర హైస్కూల్, జూనియర్ కళాశాలలో పెండింగ్ పనులు పూర్తి చేయడానికి రూ.1.30 కోట్ల నిధులు మంజూరు చేయాలని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టర్‌కు ప్రావీణ్యకు వినతి పత్రం సమర్పించారు. హైస్కూల్, జూనియర్ కళాశాలను వేరు చేస్తూ ప్రహరీ నిర్మాణం, పెయింటింగ్ , గ్రావెల్ వేయించడం లాంటి పనుల కోసం నిధులు అవసరం అవుతాయన్నారు.


