సంచార జాతుల కళలు కాపాడాలి
సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్‌బాబు
గజ్వేల్‌రూరల్: అంతరించిపోతున్న సంచార జాతుల కళలను కాపాడుతూ, వాటిని భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలంగాణ సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆకుల నరేశ్‌బాబు పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో సామాజిక సమరసతా వేదిక, విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో ఆదివారం సంచార జాతుల కళా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్‌తో కలిసి నరేశ్‌బాబు మాట్లాడారు. భారతీయ సంస్కృతిని, విలువలను తరతరాలుగా అందించే సంచార జాతుల కళా ప్రదర్శనలను నిర్వహించడం అభినందనీయమన్నారు. వివిధ వర్గాలు, ఆశ్రిత కులాలు, కుల చరిత్రలు చెబుతూ జీవనం గడిపే విముక్త సంచార జాతుల కళలు సమాజ చైతన్యానికి ఉపయోగడుతాయన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 32 సంచార జాతుల కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం కళాకారులను సన్మానించారు. కార్యక్రమంలో విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి ప్రధాన కార్యదర్శి చిరంజీవి, సామాజిక సమరసతా వేదిక తెలంగాణ ప్రాంత మహిళా కన్వీనర్ రుక్మిణి, పట్టణ ప్రముఖులు సాయినాథ్‌రెడ్డి, శ్రీధర్, నాగేందర్‌తో పాటు ప్రజలు పాల్గొన్నారు.


