రోడ్డు విస్తరణకు బ్రేక్
జోగిపేట(అందోల్): జోగిపేట పట్టణంలోని ప్రధాన రహదారిని విస్తరించకపోవడానికి గల కారణాలపై స్థానికంగా చర్చ జరుగుతోంది. అందోల్ అంబేడ్కర్ విగ్రహం నుంచి జోగిపేట అంబేడ్కర్ వరకు ఉన్న రోడ్డును విస్తరించకుండా కేవలం అంబేడ్కర్ విగ్రహం నుంచి మాసానిపల్లి చౌరస్తా వరకు మాత్రమే 70 అడుగుల రోడ్డును నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి రోడ్లు భవనాల శాఖ అధికారులు సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. సంగుపేట నుంచి అందోల్ అంబేడ్కర్ వరకు, పట్టణంలోని పెట్రోల్ పంపు వద్ద నుంచి అన్నాసాగర్ దర్గా వరకు రోడ్డును ఫోర్‌లేన్‌గా ఏర్పాటు చేసేందుకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అందోల్ వైపు డివైడర్ పనులు కూడా దాదాపుగా పూర్తి కావొస్తున్నాయి. అయితే అందోల్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి భారత్ పెట్రోల్ పంపు వరకు పదేళ్ల క్రితం కేవలం డివైడర్ పనులు చేపట్టి రోడ్డును విస్తరించకుండా వదిలేశారు. పట్టణంలో కనీసం 60 అడుగుల వరకు రోడ్డును విస్తరించకుండా వదిలేసి మిగతా భాగాన్ని రోడ్డు విస్తరించడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ రోడ్డుకిరువైపులా ఉన్న వ్యాపార, వాణిజ్య సంస్థలు ఇరుకుగా ఉన్నాయి. ఈ రోడ్డుపైనే ఆటోలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కార్లు, బైకులు రోడ్డుపైనే పెట్టుకుని దుకాణాల్లో కొనుగోలు చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
గతంలో సర్వేలు చేసి వదిలేశారు
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జోగిపేట పట్టణంలోని ప్రధాన రహదారికిరువైపులా రోడ్డు విస్తరణకుగాను మార్కింగ్ కూడా చేశారు. కొన్నిచోట్ల రోడ్డు ముందుకు వచ్చి నిర్మాణాలు చేసుకున్న వారు కూలగొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. సిద్దిపేట, దుబ్బాక, సిరిసిల్ల, నర్సాపూర్ ప్రాంతాల్లో రోడ్డును విస్తరించి పాదాచారుల కోసం బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో పట్టణాలు సైతం చూడటానికి విస్తారంగా కనిపించడంతోపాటు రవాణా రాకపోకలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనుకున్నారు. అయితే మధ్యలోనే ఈ పనులను ఆపివేశారు.
నాయకుల ఒత్తిడే కారణమా?
2023 ఎన్నికల్లో అందోల్ ఎమ్మెల్యేగా ఎన్నికై న తర్వాత మంత్రి దామోదర రాజనర్సింహ జోగిపేట పట్టణాన్ని సిరిసిల్ల, సిద్దిపేట పట్టణాల కంటే అందంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేశారు. పట్టణంలో 60 అడుగుల రోడ్డును ఏర్పాటు చేయాలని పలుమార్లు ప్రకటించారు. సంగుపేట వద్ద నుంచి అన్నాసాగర్ వరకు రోడ్డు విస్తరణ పనులకుగాను ప్రభుత్వం ద్వారా రూ.20 కోట్ల నిధులను మంజూరు చేయించారు. అయితే స్థానిక నాయకుల ప్రమేయంతో పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయినట్లుగా స్థానికంగా చర్చ జరుగుతోంది. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉ ండటంతో స్థానిక నాయకులు మంత్రిపై ఒత్తిడి తెచ్చి ఈ పనులు నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అంబేడ్కర్ రోడ్డును 70 అడుగుల వెడల్పుతో
అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి మాసానిపల్లి వరకు గల కి.మీ రోడ్డును మాత్రం 70 అడుగుల రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి సర్వే పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ రోడ్డు అజ్జమర్రి బ్రిడ్జి వద్ద నుంచి డాకూరు రోడ్డుకు అనుసంధానిస్తూ రోడ్డును అభివృద్ధి చేసేలా ప్రణాళికను చేపడుతున్నట్లు సమాచారం. మంత్రి దామోదర ఈ రోడ్డుపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ రోడ్డు పనులు చేపట్టి తీరాల్సిందేనని రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశించిన విషయం తెలిసిందే.
అధికారపార్టీ నాయకుల జోక్యమే కారణమా?
ఇరుకై న రోడ్లతో ప్రజలకు తప్పని ఇబ్బందులు
జోగిపేట రోడ్డు విస్తరణపై మంత్రి గతంలో హమీ!
పాదాచారులకు ప్రత్యేకంగా రోడ్డు
పాదాచారులు రోడ్డుపై నడవకుండా ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సిద్దిపేట, సిరిసిల్ల, నర్సాపూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విధంగా జోగిపేటలో కూడా ఏర్పాటు చేయాలని జోగిపేట అభివృద్ధిని కాంక్షించే పలువురు సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు గతంలో మంత్రిగా పనిచేసిన కాలంలోనే ఈ పనుల కోసం రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రకటించారు. కానీ ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. మంత్రి దామోదర రాజనర్సింహ అయినా ఈ విషయంలో చొరవచూపాలని స్థానికులు కోరుతున్నారు.


