ఆడపిల్లను ఆదరిద్దాం
బాలికలు.. భవిష్యత్ దీపికలు
● ఉమ్మడి జిల్లాలో తగ్గిన జనన రేటు ● 2022తో పోలిస్తే 2023లో తగ్గిన జననాలు ● సీఆర్‌ఎస్ తాజా నివేదికలో వెల్లడి
అవకాశాలు అందిపుచ్చుకుని ఆడపిల్లలు ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నారు. పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. అయినా ఇంకా కొంతమంది వదిలించుకోవాలన్న దురాలోచన చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో బాలికల జనన రేటు దారుణంగా పడిపోయింది. కేంద్ర జనగణన విభాగం ఇటీవల విడుదల చేసి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం(సీఆర్‌ఎస్) నివేదిక–2023లో పలు అంశాలు వెల్లడయ్యాయి. ఇదిలా ఉంటే.. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మహిళా కలెక్టర్లుగా అత్యున్నత స్థాయిలో ఉండి పురుషులకు దీటుగా పాలన కొనసాగిస్తున్నారు.
–సాక్షి, సిద్దిపేట
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం జననాలు 72,545, మరణాలు 17,392 జరిగాయి. 2023లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరింత మెరుగైన సేవలు అందించడంతో 2022తో పోలిస్తే శిశుమరణాలు బాగా తగ్గాయి. సీఆర్‌ఎస్ నివేదిక ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2022లో 74,862 మంది, 2023లో 72,545 మంది జన్మించారు. ఈ నివేదిక ప్రకారం చూస్తే జననాలు 2,317 తగ్గాయి. 2022లో మగ శిశువులు 38,928, 2023లో 37,928 మంది పుట్టారు. 2022లో ఆడపిల్లలు 35,934, 2023లో 34,617 మంది జన్మించారు.
పెరిగిన శిశు మరణాలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో శిశు మరణాలు పెరిగాయి. 2023లో 471 మంది చిన్నారులు మృతి చెందితే అందులో 273మంది మగపిల్లలు, 198మంది ఆడ పిల్లలు మృతి చెందారు. 2022లో ఈ మొత్తం 447 మందిగా ఉంది. 2023లో నాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కృషితో సిద్దిపేట, గజ్వేల్ ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందాయి. దీంతో శిశు మరణాలు తగ్గుముఖం పట్టాయి.
తగ్గిన మరణాలు
2022లో 22,014మంది, 2023లో 17,392 మంది మృతిచెందారు. మెరుగైన వైద్య సేవలు అందడంతో పాటు, ఆరోగ్యంపై అందరూ ప్రత్యేక దృష్టి సారిస్తుండటంతో గతంతో పోలిస్తే మరణాలు తగ్గాయి.


