సదర్‌లో జగ్గారెడ్డి సందడి
సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్ లో ‘‘పెద్ద గొల్ల సదర్ ఉత్సవం’’ఆదివారం ఘనంగా నిర్వహించారు. దున్నపోతుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. యువత అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. వారిలో జోష్ నింపేలా గాయకులు పాటలు పాడి ఆహుతులను అలరించారు. ఈ ఉత్సవంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కూన సంతోశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సదర్ ఉత్సవానికి హాజరైన జగ్గారెడ్డి అందరిలో జోష్ నింపారు. కార్యక్రమానికి వచ్చినవారు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి ప్రదర్శించారు. అనంతరం అక్కడున్న వారితో కలిసి జగ్గారెడ్డి స్టెప్పులు వేశారు. సదర్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించిన ప్రతినిధులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు: అమీన్‌పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు ఆర్టీసీ కాలనీలో కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తూ నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కాలనీల మధ్య అంతర్గత రహదారులు నిర్మిస్తూ.. మెరుగైన రవాణా సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు.
కోర్టు తీర్పును
అమలు చేయాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: పెండింగ్ డీఏలతోపాటు డీఎస్సీ 2003 ఉపాధ్యాయులపై కోర్టు తీర్పును అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జ్ఞాన మంజరి ప్రభుత్వాన్ని కోరారు. సంగారెడ్డిలోని కేవల్‌కిషన్ భవన్‌లో ఆదివారం నిర్వహించిన టీఎస్ యూటీఎఫ్ సంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశంలో జ్ఞానమంజరి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తాను ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉన్న డీఏను నవంబర్ నెలలో ప్రకటించి అమలు చేయాలన్నారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లులను ప్రతీ నెల రూ.700 కోట్లు విడుదల చేసి ఉద్యోగుల అకౌంట్‌లో జమ చేయాలని కోరారు. గతంలో కేంద్రప్రభుత్వం 57 రూల్‌కు అనుగుణంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పింఛను పథకం ప్రకటిస్తూ అమలు చేయడానికి వెంటనే ప్రొసీడింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల కొరతను అధిగమించేందుకు తాత్కాలిక ఉపాధ్యాయులు (విద్యా వలంటీర్ల)ను నియమించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సమ్మె కాలపు వేతనాలు ఇవ్వడంతోపాటు సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తూ జీతాలు పెంచాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి సాయిలు ఉపాధ్యక్షుడు కాశీనాథ్, సువర్ణ కోశాధికారి శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి షామయ, నరసయ్య, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
సదర్‌లో జగ్గారెడ్డి సందడి


