సాగుకు ఉపాధి ఊతం
● వ్యవసాయ అనుబంధ పనుల గుర్తింపు
●కొత్తగా పౌల్ట్రీ, గొర్రెలు, మేకలు, పాడి పశువుల షెడ్లు
●ఇంకుడు గుంతల నిర్మాణానికీ అవకాశం
●నవంబర్ 30లోగా పనుల జాబితా అందించాలి
నారాయణఖేడ్: వలసలు నివారించి సొంత ఊరిలోనే ఉపాధి పనులు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలు చేస్తోంది. కాలానుగుణంగా పలు నూతన పనులు ఈ పథకంలో చేరుస్తూ కూలీలకు ఉపాధి కల్పిస్తూ రైతులకు ప్రయోజనం చేకూర్చుతుంది. గ్రామాల్లోని చెరువులు, కాలువలు, మొక్కల పెంపకం వంటి వాటితోపాటు గత రెండేళ్లుగా ఈ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసే విధంగా చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల్లో వ్యక్తిగత లబ్ధిదారులకు సంబంధించిన పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. స్వయం సహాయక బృందాలు, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం సమన్వయంతో పశువుల, గొర్ల, కోళ్ల పెంపకం, పాకల నిర్మాణం, అజోల్ల సాగు, బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణం, వర్మీ కంపోస్టు పిట్ నిర్మాణం వంటి వాటికి ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. లేబర్ బడ్జెట్ తయారీకి సంబంధించి గ్రామ సభలు నిర్వహించాలని, గ్రామ సహజ వనరుల కమిటీ సభ్యుల భాగస్వామ్యంతో పనులను గుర్తించి వివరాలతో నివేదిక రూపొందించాలని ఆదేశాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. ఆ పనులకు గ్రామ సభ ఆమోదంతో ఫార్మాట్–1లో పనుల వివరాలను పొందుపరిచి పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని స్పష్టం చేసింది. గ్రామాల్లో చేపట్టాల్సిన పనుల వివరాలను నవంబర్ 30లోగా తప్పనిసరిగా అందజేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఎక్కువగా వ్యవసాయరంగ పనుపై దృష్టి సారించాలని ఆదేశించింది. మిషన్ వాటర్ కన్జర్వేటర్ మండలాల్లో సహజ వనరుకలు సంబంధించి పనులు 65%, వ్యక్తిగత పనులు 60%కు మించి గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
కొనసాగుతున్న గ్రామ సభలు..
జిల్లాలో 619 గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు సాగుతుండగా పనుల గుర్తింపునకు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. గ్రామ సభల్లో వ్యవసాయ అనుబంధంగా జిల్లాలో అజోలా గడ్డి సాగు, చెక్ డ్యామ్‌ల నిర్మాణం, అన్ని రకాల పంటలతో సాగు, ఫారం ఫాండ్స్ నిర్మాణం, ఫీడర్ ఛానెల్స్‌లో పూడికతీత, మళ్ళింపు కాలువలు, భూమి చదును, రాళ్ళకట్టల నిర్మాణం తదితర పనులు గుర్తిస్తున్నారు. ముఖ్యంగా సన్న చిన్నకారు రైతుల భూమి చదునుకు ప్రాధాన్యతనిస్తూ మొదటగా ఎస్సీ, ఎస్టీలు తర్వాత ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
షెడ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం
ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఆదేశాల ప్రకారం పౌల్ట్రీ షెడ్లను ఉపాధి హామీ పథకం కింద నిర్మించనున్నారు. రైతుకు ఒక్కో షెడ్‌కు యూనిట్‌కు రూ.85వేలు అందిస్తారు. దీని ద్వారా రైతు షెడ్డును నిర్మించుకుని 100 నాటు కోడిపిల్లలను పెంచాల్సి ఉంటుంది. పశువుల పాకలకు యూనిట్ ధర రూ.96వేలు అందించనుంది. 3 పశువులు కచ్చితంగా ఉన్నవారికే ప్రాధాన్యమిస్తారు. మేకలు, గొర్రెల షెడ్ల నిర్మాణానికి యూనిట్‌కు రూ.98వేలు అందించనున్నారు.


