పరిశ్రమల ఏర్పాటుకు సత్వర అనుమతులు
కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి జోన్: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, సత్వరం అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో పరిశ్రమల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.24 లక్షల సబ్సిడీకి డీపీసీ ఆమోదం తెలిపిందన్నారు. ఈ వర్గాల యువత పరిశ్రమల స్థాపనలో ముందుకు వచ్చి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రా మెటీరియల్స్ సరఫరా, భూకమతాల మంజూరు, విద్యుత్ కనెక్షన్లు, ఇతర అనుమతులపై వచ్చిన దరఖాస్తులను సమీక్షించి, ఫైళ్లను త్వరితగతిన మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్, ఎకై ్సజ్, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.


