నాగపురిలో రాష్ట్ర కూటుల నాటి శాసనం
చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని నాగపురి గ్రామంలో రాష్ట్ర కూట కాలం నాటి శాసనం ఉందని చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గ్రామంలో పరిశీలించిన సమయంలో పోచమ్మ దేవాలయం పక్కన వేపచెట్టు కింద చెట్ల మధ్యలో రాళ్లతో కట్టిన చిన్న దేవాలయం కనిపించిందన్నారు. దేవాలయ రాళ్లు పరిశీలించగా ఆలయానికి వాడిన ఒక పొడవాటి రాయిపై అక్షరాలు కనిపించాయని, రాయికి సున్నం వేసి ఉండటం వల్ల అక్షరాలు సరిగా కనిపించడం లేదన్నారు. కనిపించిన అక్షరాల లిపిని బట్టి ఇది 8 నుంచి 10వ శతాబ్దం నాటి లిపి అని, అనగా రాష్ట్ర కూటుల కాలం నాటి శాసనంగా భావిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులు సహకరిస్తే ఆ శాసనాన్ని శుభ్రపరిచి అక్షరాలను చదివితే చరిత్ర, శాసన కాలం అందులో పేర్కొన్న వివరాలు తెలుస్తాయన్నారు.
చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్


