గుంతను తప్పించబోయి..
చిన్నశంకరంపేట(మెదక్): కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని కొర్విపల్లి వద్ద చోటుచేసుకుంది. బుధవారం మెదక్ వైపు నుంచి వస్తున్న సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం రాంరెడ్డిపేటకు చెందిన ఆవుసుల సాయిబాబా కుటుంబ సభ్యులతో కలిసి వర్గల్ హాస్టల్‌లో తమ కూతురును దింపేందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో కొర్విపల్లి వద్ద మెదక్–చేగుంట ప్రధాన రహదారిపై ఏర్పడ్డ పెద్ద గుంతను తప్పించబోయి కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న పాప కంటికి దెబ్బతగలగా, మిగతా వారికి స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు.


