కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కొండపాక(గజ్వేల్): వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లికి చెందిన మర్వాడి దేవదానం(33) డ్రైవరుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో డ్రైవర్ వృత్తి సరిగా కొనసాగకపోవడంతో మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో కుటుంబ పోషణ విషయంలో తరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కూతురు శారీ ఫంక్షన్ కోసం చేసిన అప్పుల విషయంలో బుధవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురై గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకున్నాడు.
రోళ్లపాడ్‌లో గుర్తు తెలియని మృతదేహం
వట్‌పల్లి(అందోల్): మండల పరిధిలోని రోళ్లపాడ్ గ్రామ శివారులోని మంజీరా నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. జోగిపేట ఎస్‌ఐ పాండు వివరాల ప్రకారం... గ్రామ శివారులోని మంజీరా నదిపై ఉన్న చెక్‌డ్యాం వద్ద మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో అటుగా వెళ్లిన వారు పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని వెలికితీశారు. మృతి చెందిన వ్యక్తికి 20 నుంచి 30 ఏళ్ల ఉంటాయని, తెల్లచొక్కా, నీలంరంగు ప్యాకెట్ ఉన్న చొక్కా ధరించి ఉన్నట్లు తెలిపారు.
ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతు
అక్కన్నపేట(హుస్నాబాద్): ఈతకు వెళ్లిన యువకుడు నీటి గుంతలో గల్లంతయ్యాడు. ఈ ఘటన మండలంలోని జనగామ గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఎండీ.చాంద్ పాషా( 21), గౌస్, మైబుల్, షాదుల్లా స్నేహితులు. సరదాగా హుస్నాబాద్ నుంచి వెళ్లి నిండుకుండలా జలసవ్వడితో ఉన్న గుంత పక్కనే కూర్చొని మద్యం తాగారు. ఈ క్రమంలో చాంద్ పాషా ఈత కొట్టేందుకు నీటి గుంతలోకి దిగాడు. కొద్దిసేపటికీ బయటకు రాకపోవడంతో గల్లంతు అయినట్లు పోలీసులకు స్నేహితులు సమాచారం అందించారు. వెంటనే ఎస్‌ఐ ప్రశాంత్‌తో పాటు హుస్నాబాద్ ఎస్‌ఐ లక్ష్మారెడ్డి, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గల్లంతు అయిన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య


