వైద్యంలో విప్లవాత్మక మార్పులు
హుస్నాబాద్: నాలుగు జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉన్న హుస్నాబాద్‌లో వైద్య పరంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పట్టణంలో రూ.82 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 250 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో ఎనిమిదిమంది డాక్టర్లు మాత్రమే ఉన్నారని, నెల రోజుల్లో 38 మంది రానున్నారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు వైద్యపరంగా ఎవరూ ఆందోళన చెందవద్దని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మాదిరిగా అన్ని రకాల శస్త్ర చికిత్సలు, వైద్య సేవలు అందుతాయన్నారు. జిల్లా కేంద్రాల్లో తప్ప 250 పడకల ఆస్పత్రి హుస్నాబాద్‌లోనే ఏర్పాటు కానుందని తెలిపారు. అందుకనుగుణంగా నర్సింగ్ కళాశాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. మినీ స్టేడియంను విస్తరించి స్విమ్మింగ్‌పూల్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పట్టణంలో అర్బన్‌పార్క్‌తోపాటు మహాసముద్రం గండి సుందరీకరణ కోసం రూ.10 కోట్ల మంజూరుకు జీవో వస్తుందని చెప్పారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి నుంచి హుస్నాబాద్‌కు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి కాలువల నిర్మాణ భూ సేకరణకు రైతులు సహకరించాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్టీఓ రామ్మూర్తి, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్‌రెడ్డి తదితరులున్నారు.
నెలరోజుల్లో
38 మంది వైద్యులను నియమిస్తాం
మంత్రి పొన్నం ప్రభాకర్


