అంత్యక్రియలకు వెళ్లి స్నానం చేస్తుండగా..
హవేళిఘణాపూర్(మెదక్): స్నానం చేసేందుకు వెళ్లిన బాలుడు మునిగిపోగా, అతడిని కాపాడే ప్రయత్నంలో మరొక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పేరూర్ గ్రామానికి చెందిన చింతకింది అంజమ్మ అంత్యక్రియలకు కృష్ణ(16), చింతకింది భీమయ్య(48) వెళ్లారు. కార్యక్రమం అనంతరం స్నానం చేసేందుకు మంజీరా వాగు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో స్నానం చేస్తూ కృష్ణ నీటమునిగాడు. అతడ్ని కాపాడే ప్రయత్నంలో భీమయ్య కూడా నీటమునిగి మృతి చెందాడు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు పుష్కలంగా ఉండటంతోపాటు అక్కడ నది లోతుగా ఉందని పోలీసులు తెలిపారు.
అస్థికలు కలుపడానికి వెళ్లి..
పుల్‌కల్(అందోల్): అస్థికలు కలుపడానికి వెళ్లిన వ్యక్తి కాలు జారి నదిలో పడిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మిర్జాగూడకు చెందిన దండారియ ధరంసింగ్, మదయ్య సూరజ్‌సింగ్ బంధువుల అస్థికలు కలుపడానికి సోమవారం సింగూరు ప్రాజెక్టుకు వెళ్లారు. అస్థికల క్రతువు పూర్తయిన తర్వాత మదయ్య సూరజ్ సింగ్(52) స్నానానికని ప్రాజెక్టు దిగువభాగంలో బండరాళ్లపై నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలి జారి నీటిలో పడిపోయాడు. జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి నీరు రావడంతో ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీంతో రెండు రోజుల నుంచి కుటుంబ సభ్యులు ప్రాజెక్టు వద్ద గల్లంతైన సూరజ్‌సింగ్ కోసం మత్స్యకారుల సహాయంతో వెతుకుతున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ విశ్వజన్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంజీరా వాగులో పడి ఇద్దరు మృతి
అంత్యక్రియలకు వెళ్లి స్నానం చేస్తుండగా..


