పేకాట స్థావరాలపై ఉక్కుపాదం
ఉమ్మడి జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జూదం ఆడుతున్న పలువురిని అరెస్ట్ చేశారు.
చేగుంట(తూప్రాన్) /కల్హేర్(నారాయణఖేడ్)/న్యాల్‌కల్(జహీరాబాద్): పేకాట ఆడుతున్న పలువురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి వివరాల ప్రకారం... విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి చేగుటంలో పేకాట ఆడుతున్న ఇంటిపై పోలీసులు దాడి చేశారు. 8 మందిని అరెస్టు చేసి, ఏడు సెల్‌ఫోన్లు, రూ.58 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కల్హేర్ మండలంలోని మాసాన్‌పల్లిలో పేకాట ఆడుతున్న 8 మందిని, సిర్గాపూర్ మండలం కడ్పల్ తండా సమీపంలో 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. న్యాల్‌కల్ మండలలోని ముర్తుజాపూర్ సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5,770 నగదుతో పాటు పేకాట ముక్కలు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
జహీరాబాద్‌లో 55 మంది..
కంగ్టి(నారాయణఖేడ్)/ రామచంద్రాపురం(పటాన్‌చెరు)/ జహీరాబాద్ టౌన్: కంగ్టి మండలంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని, తెల్లాపూర్‌లో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని, రూ.3, 36,500, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జహీరాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 85,550 నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు.


