వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి
మిరుదొడ్డి(దుబ్బాక): గుంతలమయమైన రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అందె జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సభ్యులు డిమాండ్ చేశారు. మిరుదొడ్డి నుంచి అందె, ఇక్కడి నుంచి కొండాపూర్ మీదుగా దుబ్బాక మండలం తిమ్మాపూర్, అందె గ్రామం స్టేజీ వరకు ఉన్న రోడ్లకు మరమ్మతులు చేట్టాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జేఏసీ సభ్యులు మిరుదొడ్డి తహశీల్దార్, ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రానికి పలు పనుల నిమిత్తం ప్రయాణికులు, రైతులు, కళాశాలలు, పాఠశాలలకు విద్యార్థులు, తదితరులు రాకపోకలు సాగిస్తారని తెలిపారు. అందె నుంచి మిరుదొడ్డి వరకు కంకర తేలి రోడ్డు గుంతలమయంగా మారిందని, దీంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల సమస్యకు పరిష్కారం చూపకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు లింగం, ప్రవీణ్, మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీలు సోమేశ్వర్‌రెడ్డి, భైరయ్య, సత్యం, రాజేందర్, యాదగిరి, కరుణాకర్, సాయికుమార్‌రెడ్డి, చందు, రాములు, నాగేశ్వర్‌రెడ్డి, రాజ్‌కుమార్, శ్రీనివాస్, నర్సింగరావు, కుమార్, కృష్ణ, బాలకనకయ్య తదితరులు పాల్గొన్నారు.
లేకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం


