శనగ సాగు తరుణమిదే!
● యాజమాన్య పద్ధతులతోనే అధిక దిగుబడులు
● 20 వేల ఎకరాల్లో సాగు అంచనా
● ఇప్పటికే ప్రారంభమైన విత్తన నాట్లు
జహీరాబాద్ టౌన్: పప్పు దినుసులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కంది తర్వాత రబీలో రైతులు శనగ పంట అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఈ పంట సాగుకు ఇదే సరైన తరుణం కావడంతో రైతులు అందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా శనగ, జొన్న, వరి, కుసుమ, గోధుమ తదితర పంటలను రబీలో సాగు చేస్తుంటారు. జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల్లో శనగ పంటను రైతులు సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు ఈ పంట సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సన్నద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు నాటడం ప్రారంభించారు. నల్ల రేగడి భూముల్లో పంట సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయనిపుణులు చెబుతున్నారు.
ఈ నియోజకవర్గాల్లో అధికంగా సాగు..
జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో శనగ పంట అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ నెలాఖరు వరకు అనుకూల సమయం కావడంతో విత్తనాలు విత్తుకోవచ్చు. తర్వాత వేస్తే దిగుబడులు తగ్గుతాయి. విత్తనం విత్తుకోవడంలో ఆలస్యమైతే పూత దశలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు పూత రాలిపోతుంది. మంచు ఆధారంగా పండే పంట, నల్లరేగడి నేలల్లో తేమను ఉపయోగించుకుని మొక్కులు పెరుగుతాయి. చౌడు నేలలు పనికిరావు. పూత, కాత సమయల్లో సరిపడ నీరు అందించినా సరిపోతుంది.
విత్తన రకాలివే..
కేఏకే 2, జేజీ 11,శ్వేత 2, జ్యోతి, కేఏకే –2, క్రాంతి, అన్నెగిరి, తదితర విత్తన రకాలు మేలైనవి. స్వల్పకాలిక పంట అయినందున విత్తన రకాలను బట్టి 85–100 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 40 కిలోల విత్తనాలు సరిపోతుంది. ఎకరాకు 6 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది. విత్తిన నెల రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. 30 నుంచి 35 రోజుల దశలో గొర్రుతో అంతరకృషి చేసి కలుపు నివారించుకోవచ్చు. విత్తే ముందు ఫ్లూకోరాలిన్ 45% మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. పంటకు పచ్చ, రబ్బరు పురుగు బెడద అధికంగా ఉంటుంది. ఎండు తెగుళ్లు, వేరు తెగుళ్లు సోకుతాయి. విత్తనాలు. తెగుళ్ల నివారణకు అందుబాటులో ఉన్న వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలి.


