సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: పేద వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి కోరారు. వివిధ గ్రామాలకు చెందిన పలువురికి ఆస్పత్రి ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను మంగళవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సంక్షేమంతోపాటు అభివృద్ధి పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని గుర్తు చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహ్మారెడ్డి నాయకులు అవుటి శంకర్ పాల్గొన్నారు. ఖేడ్ ఆర్టీసీ డీఎంగా బాధ్యతలు చేపట్టిన సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే సంజీవరెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఖేడ్ ప్రాంతంలో ఆయా రూట్లలో పలు బస్సులు నడపాల్సిన గ్రామాలను గురించి వారు చర్చించారు. ఖేడ్ క్యాంపు కార్యాలయంలో దీపావళిని పురస్కరించుకుని ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అనుపమారెడ్డి దంపతులు లక్ష్మిపూజ నిర్వహించారు.
పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి శివాలి జోహ్రి శ్రీవాస్తవ ఆమె తల్లి కవితా జోహ్రి శ్రీవాస్తవతో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఒరిగామి ప్రదర్శన చేసి రెండు సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించారు. ఈ తాజా రికార్డుతో, శివాలి మొత్తం 21 గిన్నిస్ వరల్డ్ రికార్డులకు చేరుకుని దేశంలోనే అత్యధిక సంఖ్యలో గిన్నిస్ రికార్డులు కలిగి ఉన్న వ్యక్తిగా నిలిచింది. గతంలో శివాలి 19 గిన్నిస్ రికార్డులు సాధించిన సంగతి తెలిసిందే. గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి, పలువురు అధ్యాపకులు, వి ద్యార్థులు శివాలిని అభినందించారు.
జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి
న్యాల్‌కల్(జహీరాబాద్): రైతులకు సకాలంలో విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా మండలానికి 350 బస్తాలు శనగ విత్తనాలు, 5 క్వింటాళ్ల కుసుమ విత్తనాలు వచ్చాయని వెల్లడించారు. విత్తనాలు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న రైతులు పట్టా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులతో రైతు వేదిక వద్దకు మంగళవారం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. విత్తనాలను న్యాల్‌కల్‌లోని రైతు వేదికల్లో రైతులకు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి అభినాష్ వర్మ, ఏఈఓలు సాయిలు, హీనా, రైతులు పాల్గొన్నారు.
నర్సాపూర్: విద్యుత్ సమస్యలను గుర్తించేందుకే తమ శాఖ ప్రజాబాట కార్యక్రమం చేపట్టిందని మెదక్ డీఈ బాషా, ఏడీఈ రమణరెడ్డి చెప్పారు. మంగళవారం పట్టణంలో ప్రజా బాట కార్యక్రమాన్ని డీఈ ప్రారంభించారు. ప్రజాబాటలో పలు సమస్యలను గుర్తించామని, వాటిని రెండు విభాగాలు విభజించామని చెప్పారు. బడ్జెట్‌తో కూడుకున్న సమస్యలకు నిధులు రాగానే పరిష్కరిస్తామన్నారు. బడ్జేతర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని రమణరెడ్డి తెలిపారు. పలు వీధుల్లో కండక్టర్ వైరు పాతబడిందని, దానిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఏఈ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి
సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి


