ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
మంజీరాలో పడి యువకుడు మృతి
కొల్చారం(నర్సాపూర్): ప్రమాదవశాత్తు యువకు డు మంజీరా నదిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ కాకినా డకు చెందిన నీల సత్తిబాబు కుమారుడు నాని బాబు (21) స్నేహితులతో కలిసి అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం ఏడుపాయలకు కారులో వచ్చారు. దర్శనం చేసుకున్న అనంతరం సాయంత్రం స్నానాల కుంటలోకి దిగారు. అతను సెల్ఫీ తీసుకుంటుండగా కాలుజారి ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. లోతుగా ఉండటంతో మునిగిపోయాడు. గజ ఈతగాళ్ల సహాయంతో బయటకి తీయగా అప్పటికే మృతి చెందాడు.
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
జిన్నారం (పటాన్‌చెరు): గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్సై హనుమంతు వివరాల ప్రకారం... గడ్డపోతారం పట్టణ పరిధిలోని చౌదరిగూడెం గ్రామానికి చెందిన పాండురంగ చారి (45) శనివారం గ్రామంలోని లింగం చెరువులోకి ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గాలించగా ఆదివారం సాయంత్రం మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు.
ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి..
వట్‌పల్లి(అందోల్): మంజీరా నదిలో దూకి అత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. అందోల్ మండలం రోళ్లపాడ్ గ్రామానికి చెందిన పెద్దగొల్ల రాములు కుటుంబంతో ఇస్నాపూర్‌లో ఉంటున్నాడు. పెద్ద కుమారుడు జగన్(17) శంకర్‌పల్లిలోని ప్రభుత్వ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 16న ఉదయం కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి చింతకుంట మంజీరా బ్రిడ్జి వద్ద నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నదిలో వరద ప్రవాహం ఉండటంతో మృతదేహం ఆచూకీ లభించలేదు. ఆదివారం కొల్చారం మండలం పైతర గ్రామ శివారులోని మంజీరా చెక్‌డ్యాం వద్ద నదిలో మృతదేహం కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహా న్ని బయటకు తీసి పెద్దగొల్ల జగన్‌గా గుర్తించారు.
చెరువులో పడి వ్యక్తి...
మెదక్ మున్సిపాలిటీ: చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణంలోని దాయర వీధికి చెందిన అదరాసి మహేశ్(28) గోసముద్రం చెరువులో స్నానం చేసేందుకు ఈనెల 18న వెళ్లాడు. తిరిగి రాక పోగా ఆదివారం చెరువులో శవమై కనిపించాడు. మృతుని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా


