ఫైనాన్స్ వేధింపులు.. యువకుడు ఆత్మహత్య
నంగునూరు(సిద్దిపేట): ఫైనాన్స్ వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని బద్దిపడగలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాలు... గ్రామానికి చెందిన అవేటి వినోద్ కుమార్ (28) ఆరు నెలల కింద ఓ ప్రైవేట్ ఫైనాన్స్‌లో రూ.50 వేలు చెల్లించి రూ .4.50 లక్షల లోన్‌తో డోజర్ ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అది సరిగా నడవకపోవడంతో ఈఎంఐలు కట్టలేదు. దీంతో డబ్బులు కట్టాలని ఫెనాన్స్ వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురై శనివారం రాత్రి ఇంట్లో చీరతో ఉరేసుకున్నాడు. అతనికి భార్య రేఖ, కూతురు కీర్తన, కుమారుడు అక్షిత్ ఉన్నారు.
కడుపునొప్పి భరించలేక..
మునిపల్లి(అందోల్): వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బుదేరా ఏఎస్‌ఐ ఎం. రవి వివరాల ప్రకారం... మండలంలోని ఇబ్రాహీంపూర్ గ్రామానికి చెందిన ఎండీ దుదేకుల మదార్ పాషా (42)కు కొంత కాలంగా కడుపునొప్పి వస్తోంది. దీంతో ఆయన తరచు మద్యం తాగేవాడు. ఈ క్రమంలో ఆదివారం కడుపునొప్పి రావడంతో తాగిన మత్తులో వ్యవసాయ పొలం దగ్గర ఉన్న చింతచెట్టుకు తాడుతో చెట్టుకు ఉరివేసుకున్నాడు.
అప్పులు తీర్చలేక...
మెదక్ మున్సిపాలిటీ: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబీకుల కథనం మేరకు... మెదక్ పట్టణంలోని పెద్ద బజార్ వీధికి చెందిన నరేశ్‌చారి(40) కులవృత్తిపై ఆధారపడి భార్య, పిల్లలను పోషిస్తున్నాడు. నిత్యం బంగారం ధరలు పెరుగుతుండటంతో ఉపాధి దొరకడం కష్టంగా మారింది. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీనికి తోడు కుటుంబ పోషణకు చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక నరేశ్ చారి తన ఇంట్లోనే ఉరివేసుకున్నాడు.
ఆర్థిక ఇబ్బందులతో..
వెల్దుర్తి(తూప్రాన్): ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మేడ్చల్మె నాగరాజు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆటో ఫైనాన్స్ డబ్బులు కట్టడానికి ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబంలో చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వెల్దుర్తిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం తూప్రాన్ ఏరియా ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతిచెందాడు.
ఫైనాన్స్ వేధింపులు.. యువకుడు ఆత్మహత్య
ఫైనాన్స్ వేధింపులు.. యువకుడు ఆత్మహత్య


