వృద్ధురాలిపై పైసాచిక దాడి
కొడుకులు, మనవ ళ్ల కర్కశం చికిత్స పొందుతూ మృతి పోస్టుమార్టం రిపోర్టుతో విషయం బయటకు ఆరుగురి అరెస్ట్, రిమాండ్
వట్‌పల్లి(అందోల్): డబ్బుల కోసం కన్న తల్లిని కర్రలతో కొట్టగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసులో ఇద్దరు కొడుకులు, నలుగురు మనవళ్లను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపించారు. ఆదివారం సీఐ అనిల్‌కుమార్, ఎస్‌ఐ లవకుమార్ కేసు వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని మర్వెళ్లి గ్రామానికి చెందిన చాకలి బసమ్మ(80) ఈనెల 1వ తేదీన అరుగుపై పడుకొని కిందపడి అనారోగ్యానికి గురైదని 3వ తేదీన సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 4న ఆమె మృతి చెందింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పలు కోణాల్లో విచారణ చేశారు. కాగా వృద్ధురాలికి ఛాతి, ఇతర భాగాల్లో రక్తపు గాయాలై మరణించినట్లు పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. దీంతో జోగిపేట సీఐ అనిల్‌కుమార్ గ్రామానికి వెళ్లి కుమారులను విచారించగా తమ తల్లి పోషణ విషయంలో తరుచుగా గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. దీంతోపాటు రైతుబంధు, పింఛన్ డబ్బుల విషయంలో గొడవపడ్డామని తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరు కుమారులు చాకలి బసయ్య, చాకలి వెంకయ్యతో పాటు మనువళ్లు అంబయ్య, నర్సింహులు, మోహన్, రాజు మద్యం మత్తులో వృద్ధురాలిని కర్రలతో కొట్టి చంపినట్లు నేరం అంగీకరించారు. పథకం ప్రకారం అరుగు పైనుంచి పడి అనారోగ్యానికి గురైందని అందరిని నమ్మించామని తెలిపారు.
డబ్బుల కోసం..


