26 కిలోల గంజాయి పట్టివేత
పటాన్‌చెరు టౌన్: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వినాయక్ రెడ్డి వివరాల ప్రకారం... ఆటోలో గంజాయిని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం రావడంతో ఎస్‌ఐ మహేశ్వర్ రెడ్డి సిబ్బందితో కలిసి ముత్తంగి ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డులో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆటో డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా ఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన నిశాద్ వీరేంద్ర కుమార్‌గా గుర్తించారు. దర్యాప్తులో నిందితుడు ఒడిశాకు చెందిన ఘెను అనే వ్యక్తి గంజాయి ఇస్తాడని, అది తీసుకెళ్లి చెప్పిన ప్రదేశంలో ఇస్తే రూ. 50 వేలు ఇస్తానని చెప్పడంతో డబ్బుకు ఆశపడి చేసినట్లు తెలిపాడు. పట్టుబడిన 26.4 కిలోల గంజాయిని, రవాణాకు ఉపయోగించిన ఆటో, సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారు. నిందితుడు వీరేంద్ర కుమార్‌ను రిమాండ్‌కు తరలించారు.


