చేపపిల్లల పంపిణీకి సర్వం సిద్ధం
నారాయణఖేడ్: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువుల నీటితో పూర్తిగా నిండి కళకళలాడుతున్నాయి. కాగా ప్రభుత్వం మత్స్యకారుల లబ్ధికోసం ‘మత్య్స భరోసా’పథకం కింద చెరువుల్లో చేపపిల్లలను వదిలేందుకు సిద్ధమైంది. జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు అధికారులు అందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. రాష్ట్రంలో మత్య్స భరోసా పథకాన్ని ఇటీవల ప్రారంభించి చేపపిల్లలను చెరువుల్లో వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లాలో వారంలోపు చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి చేతులమీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గత నెలలోనే చేపపిల్లలను వదలాలని భావించినా భారీ వర్షాలు కురవడంతో వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పథకం అమలు మరింత ఆలస్యం అయ్యింది.
జిల్లాలో 234 మత్స్యకార సంఘాలు
జిల్లాలో 1,135 నీటి వనరులు ఉండగా రిజర్వాయర్లు 3, శాశ్వత నీటి వనరులు 79, సీజనల్ నీరు నిల్వ ఉండే చెరువులు 1,025 ఉన్నాయి. 12,889 మంది సభ్యులతో 234 మత్స్య సహకార సంఘాలు కొనసాగుతున్నాయి. 8,200 మిల్లిమీటర్ల సైజు వరకు గల చేపపిల్లలను వదలనున్నారు. కట్లరోహు, పెద్దపిల్ల, బంగారు తీగ, మృగాల, కొర్రమీను తదితర రకాల చొప్పున సుమారు 3.50కోట్ల చేపపిల్లలను వదలనున్నారు.
మత్స్య భరోసా కింద లబ్ధి
ప్రభుత్వం మత్య్సకారులను సంక్షేమం కోసం మత్య్స భరోసా పథకాన్ని ప్రవేశ పెట్టింది. మత్స్యశాఖ పరిధిలో జరిగే అభివృద్ధి, సంక్షేమం, రాయితీ ప్రోత్సాహకాలు అన్నీ మత్య్సభరోసా కింద అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రాథమిక మత్స్య సహకార సొసైటీల్లో ఉన్న బేస్త, గంగపుత్రులు, ముదిరాజ్, మత్స్యకార్మికుల కుటుంబాలకు ఈ పథకం కిందనే లబ్ధి చేకూర్చనున్నారు.
చెరువు వద్ద సైన్‌బోర్డు
భారీ ఎత్తున మత్స్య భరోసా కార్యక్రమం కింద చేపపిల్లలు వదిలే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలని యోచించింది. భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేసింది. దసరా పండగలోగా కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినా స్థానిక ఎన్నికలకోడ్ అమల్లోకి వచ్చింది. పథకం కింద ప్రతీ చెరువు వద్ద ప్రత్యేకంగా రూపొందించిన సైన్ బోర్డును ఏర్పాటు చేస్తారు. సైన్ బోర్డుపై రెవెన్యూ గ్రామం, చెరువుపేరు, చెరువులో వదిలే చేపపిల్లల సంఖ్య, చెరువు ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్నదనే వివరాలను పొందుపరుస్తారు.
మత్స్య భరోసా కింద అమలు
ఈసారి 3.50 కోట్ల చేప పిల్లల పంపిణీ
ప్రతీ చెరువు వద్ద
పూర్తి వివరాలతో బోర్డులు
3.50కోట్ల చేపపిల్లల పంపిణీ
జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు సంసిద్ధంగా ఉన్నాం. మత్స్యశాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేపట్టాం. వారంలోపు మంత్రి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మత్స్యకారుల సంక్షేమం కోసం సుమారు మూడున్నర కోట్ల వరకు చేప పిల్లలను వదలనున్నాం.
– మధుసూదన్,
జిల్లా మత్స్యశాఖ అధికారి, సంగారెడ్డి


