వేధిస్తోన్న బాండ్ పేపర్ల కొరత
సంగారెడ్డి జోన్: జిల్లాలో స్టాంప్ బాండ్ పేపర్ల కొరత ఏర్పడింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి అవసరాల మేరకు సరఫరా కాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. లైసెన్స్‌డ్ స్టాంప్ వెండర్ల వద్ద లభించే బాండ్ పేపర్లు గత కొన్ని రోజుల నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో అటు సాధారణ ప్రజలతోపాటు దుకాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా బాండ్ పేపర్లు దొరకకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటుండటంతో తమ పనుల్లో ఆలస్యం అవుతుందని పలువురు చెబుతున్నారు.
వివిధ రకాల పనులకు ఇబ్బందులు
బాండ్ పేపర్ల కొరత ఏర్పడటంతో వివిధ రకాల పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూములు, ఇండ్ల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు, కుల ధ్రువీకరణ, వివిధ రకాల పనులకు సంబంధించిన అగ్రిమెంట్లు, లీగల్, నోటరీ, అమ్మకాలతోపాటు ఇతర పనులకు పేపర్లను వినియోగిస్తుంటారు. రూ.20, రూ.50, రూ100ల బాండ్ పేపర్లు అందుబాటులో ఉంటాయి. అయితే వారి వారి అవసరాలను బట్టి వాటిని కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువగా రూ.20, రూ.100 ల పేపర్లు వినియోగిస్తుంటారు. ప్రతీరోజు జిల్లా కేంద్రంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆవరణతోపాటు ఇతర ప్రాంతాల్లోని స్టాంప్ వెండర్ల దుకాణాలకు వస్తుంటారు. పేపర్ల కొరత ఉండి లభ్యం కాకపోవడంతో తమ పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు.
రెండు నెలలుగా వేధిస్తున్న కొరత
రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండి ప్రజల అవసరం మేరకు బాండ్ పేపర్లను సరఫరా చేస్తారు. కానీ గత రెండు నెలలుగా అవసరం మేరకు సరఫరా లేదు. దీంతో తమ పనులను వాయిదాలు వేసు కుంటున్నారు. ఇక స్టాంప్ బాండ్ పేపర్లు కొరతతో పేపర్లను నోటరీ చేసి సాధారణ ధర కంటే ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో నమోదు చేసి అమ్మకాలు
గతంలో బాండ్ పేపర్లను ఆఫ్ లైన్‌లో ఇష్టారీతిగా అమ్మకాలు చేసేవారు. అయితే గత రెండున్నరేళ్ల నుంచి బాండ్ పేపర్ల అమ్మకాలను ఆన్ లైన్‌లో నమోదు చేసుకుకుని అమ్ముతున్నారు. బాండ్ పేపర్ అమ్మాలంటే కొనుగోలు దారుల పేరుతోపాటు బాండ్ పేపర్ ఎందుకు అవసరమైందో పూర్తి వివరాలు నమోదు చేసుకున్న తర్వాతే అమ్ముతున్నారు. బాండ్ పేపర్లను పారదర్శకంగా అమ్మేందుకు ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.
భూ క్రయవిక్రయాలతో పాటు
ఇతర పనులకు వినియోగం
దొరకని రూ.20,రూ.100ల పేపర్‌లు
పెండింగ్ లో వివిధ రకాల పనులు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు


