రవాణశాఖ చెక్‌పోస్టులో ఏసీబీ సోదాలు
జహీరాబాద్: రాష్ట్ర సరిహద్దులోని మొగుడంపల్లి మండలంలోని మాడ్గి గ్రామ శివారులోని రవాణశాఖ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఆదివారం తెల్లవారు జామున ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఏసీబీ, డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో సిబ్బందితో తనిఖీల్లో పాల్గొన్నారు. శనివారం అర్ధరాత్రి దాటాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సరిహద్దు రవాణ శాఖ చెక్‌పోస్టుల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. అందులోభాగంగా జహీరాబాద్ సమీపంలోని 65వ జాతీయ రహదారిపై గల చెక్‌పోస్టులో ఆదివారం ఉదయం వరకు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ, డీఎస్పీ సుదర్శన్ విలేకరులతో మాట్లాడుతూ...చెక్‌పోస్టులో అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో అర్ధరాత్రి దాటాక ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో రూ.42,300 నగదు దొరికిందని వివరించారు. ఇందుకు సంబంధించి ఏఎంవీఐ కిరణ్‌కుమార్ సరైన సమాధానం చెప్పకపోవడంతో ఈ నగదును రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఏఎంవీఐ ప్రైవేటు వ్యక్తిని డ్రైవర్‌గా పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.
రూ.42,300 నగదు స్వాధీనం


