బాణసంచా దుకాణంలో అగ్నిప్రమాదం
రూ.25లక్షల విలువ చేసేటపాసులు దగ్ధం
జోగిపేటలో గంటకు పైగాభారీ పేలుడు శబ్దాలు
ఫైర్ స్టేషన్ అధికారుల సహాయక చర్యలు
జిల్లా ఫైర్ అధికారి నాగేశ్వరావు సందర్శన
జోగిపేట(అందోల్)/సంగారెడ్డి: జోగిపేట సమీపంలోని కట్టుకం వేణుగోపాల్ అండ్ సన్స్ బాణసంచా హోల్‌సేల్ దుకాణంలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.25 లక్షల విలువ చేసే మందుగుండు సామగ్రి పేలి బూడిదైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గత నెల రోజులుగా ఈ దుకాణంలో భారీగా విక్రయాలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం యథావిధిగానే అమ్మకాలు జరుగుతుండగా ఒక్కసారిగా చిన్నగా పేలుడు శబ్దం వినిపించడంతో దుకాణం నుంచి అందరూ బయటకు పరుగులుపెట్టి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. ఈలోగా దుకాణంలోని ఇతర మందుగుండు సామగ్రికి మంటలు అంటుకోవడంతో అవి పేలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడటం, ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి తీసుకున్నారు. ఇక దగ్ధమైన షాపునకు 50 మీటర్ల దూరంలోనే ఓ గోడౌన్‌లో లక్షల విలువ చేసే బాణసంచా నిలువ ఉన్నాయి. టపాసులు అటువైపు ఎగిరిపడకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది జోగిపేట, సంగారెడ్డి ఫైర్ ఇంజన్ల సహకారంతో మంటలను అదుపుచేశారు.
మేలుకోని అగ్నిమాపక శాఖ అధికారులు
ఓ వైపు నిబంధనలను పాటించాలి అంటూనే..మరోవైపు వాటిని అధికారులే విస్మరిస్తూ బాణసంచా దుకాణాలకు అనుమతులు ఇచ్చి తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఫైర్ సేఫ్టీ వివిధ శాఖల అధికారులు నిబంధనలు కఠినతరం చేసి ప్రమాదాలు నివారించేందుకు కృషిచేయాలని ప్రజలు కోరుతున్నారు. జోగిపేట సమీపంలో బాణసంచా హోల్‌సేల్ షాపు దగ్ధం కావడంతో వివరాలు తెలుసుకున్న జిల్లా ఫైర్ అధికారి నాగేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
మొత్తం 400 దుకాణాలకు అనుమతి
ఇప్పటివరకు జిల్లాతో 400 టపాకాయల దుకాణాలు అనుమతి తీసుకున్నారు. అందులో 35 షాప్‌లను తిరస్కరించాం. ఈరోజు కూడా జిల్లాలో తమ సిబ్బందిని తిప్పి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని తొలగిస్తాం.
– నాగేశ్వర్‌రావు,
జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి,


