అప్రమత్తతతోనే ఆనందకేళి
సంగారెడ్డి క్రైమ్: దీపావళి పండుగలో పెద్దల కంటే పిల్లల సందడే ఎక్కువ. బాణాసంచా పేల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. పండుగను సంతోషంగా జరుపుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. టపాకాయలు కాల్చే సమయంలో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చిన్నపాటి కారణాల వల్ల ప్రతి సంవత్సరం చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. జిల్లాలో కంటి చూపు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లు మండే పదార్థాలు టపాకాయలకు దూరంగా ఉంచాలి.
● ఇంట్లో, మేడపై కాల్చడానికి ప్రయత్నించవద్దు. బహిరంగ ప్రదేశాలు, ఆరు బయట మాత్రమే కాల్చాలి.
● ఎలాంటి అగ్ని ప్రమాదాలు సంభవించినా వెంటనే మంటలను అదుపు చేసేందుకు బకెట్‌లతో నిండుగా నీళ్లను పక్కన పెట్టుకోండి.
● నిప్పు రవ్వలు దుస్తులపై పడితే అవి త్వరగా వ్యాపించకుండా ఉండేందుకు పిల్లలతో పాటు పెద్దలు కాటన్ దుస్తులని ధరించాలి.
● గాయాలైనప్పుడు సెప్టిక్ కాకుండా నిరోధించేందుకు బర్నల్ లేదా దూది అయోడిన్ తదితర కూడిన ఫస్ట్ ఎయిడ్ కిట్టు అందుబాటులో ఉంచుకోవాలి.
● పిల్లలు కాల్చే సమయంలో పెద్దలు పక్కనే ఉండటం అత్యంత శ్రేయస్కరం.
ఇవి తప్పనిసరి
● టపాకాయలను ఒకసారి అంటించిన తర్వాత వెలగలేదని చూసేందుకు దగ్గరకు వెళ్లవద్దు. ప్రమాదవశాత్తు కొన్నిసార్లు పేలే ప్రమాదం ఉంటుంది.
● ఏమాత్రం జాగ్రత్తగా ఉన్న నిప్పు రవ్వలు పూరి గుడిసెలు, గడ్డివాములపైకి దూసుకెళ్లి అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి.
● చుడీదార్ వేసుకునేవారు వదులుగా ఉన్నవి కాకుండా బిగుతుగా ఉండేవి వేసుకోవాలి.
● పర్యావరణ హితమెన టపాకాయలు (గ్రీన్) వాడితే మంచిది.
బాణాసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి
సూచిస్తున్న నిపుణులు
పిల్లలు కాల్చేటప్పుడు పెద్దలు పక్కనే ఉండాలి


