మతిస్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్య
హవేళిఘణాపూర్(మెదక్): మతి స్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని మక్తభూపతిపూర్ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన బక్కన్నగారి మాణయ్య(47) పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు బతుకు దెరువు నిమిత్తం వెళ్లారు. కాగా స్వగ్రామానికి వెళ్తానని చెప్పి ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడు..
తూప్రాన్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని జేండాపల్లి సమీపంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ శివానందం వివరాల ప్రకారం... శివ్వంపేట మండలం దంతాన్‌పల్లి గ్రామానికి చెందిన గొల్ల నాగరాజుకు ముగ్గురు కూతుళ్లు. మగ సంతానం లేకపోవడంతో పెద్ద కూతురుకు ఇళ్లరికం అల్లుడిని తెచ్చుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలాపూర్ గ్రామానికి చెందిన పెద్దగొల్ల సాయికుమార్ (20)ను ఆరు నెలల క్రితం ఇంటికి తీసుకువచ్చాడు. కాగా ఈ నెల 15న అతడు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో నాగరాజు అతడ్ని మందలించాడు. ఆ రోజు రాత్రి 9గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిన సాయికుమార్ తిరిగి రాలేదు. చుట్టు పక్కల వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. వెంటనే శివ్వంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం హల్దీవాగులో శవమై తేలాడు.
మతిస్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్య


