విద్యార్థి మృతిపై ఎస్సీ కమిషన్ విచారణ
వారం రోజుల్లో బాధ్యులపై చర్యలు
హుస్నాబాద్‌రూరల్: మండలంలోని పోతారం(ఎస్)లోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ నెల 7న 8వ తరగతి విద్యార్థి వివేక్ అనుమానాస్పదంగా మరణించాడు. శుక్రవారం జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ జి.సునీల్‌కుమార్ బాబుతో పాటు కలెక్టర్ హైమావతి, సీపీ విజయ్‌కుమార్ పాఠశాలకు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. పాఠశాలలో ఆ రోజు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? అక్కడ ఉపాధ్యాయులు ఎవరెవరు ఉన్నారనే వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు, ప్రిన్సిపాల్స్‌ను విచారించారు. కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీపీ, సీఐలను కేసు విచారణ గురించి ప్రశ్నించారు. విద్యార్థికి పోస్టుమార్టం చేసిన డాక్టర్లను పిలిపించి మృతదేహంపై గాయాల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కేసు దర్యాప్తు నెలలో పూర్తి అవుతుందని, వారం రోజుల్లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు వివరించారు. వీరివెంట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆర్డీవో రాంమూర్తి, తహసీల్దార్ లక్ష్మారెడ్డి, ఎంపీడీఓ రమేశ్ ఉన్నారు.


