దిగుబడి..దిగాలు
పత్తిని ముంచిన అధిక వర్షాలు
ఈసారి వేధిస్తోన్న కూలీల కొరత
పెట్టుబడులు రావడంలేదని రైతుల ఆవేదన
రాయికోడ్(అందోల్)/న్యాల్‌కల్ (జహీరాబాద్): ఈ ఏడాది పత్తి సాగు రైతులకు కలిసిరాలేదు. అధిక వర్షాలకు దెబ్బతిని దిగుబడి పడిపోయింది. రూ.వేలల్లో పెట్టుబడులు వెచ్చించిన రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడి రావడంలేదని వాపోతున్నారు. ఎకరాకు కనీసం 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడిని ఆశించిన రైతులకు కేవలం మూడు నుంచి నాలుగు క్వింటాళ్లే వస్తుండటంతో రైతులు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నారు.
జిల్లాలో 3.68 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలో ఈ ఏడాది అత్యధికంగా సుమారు 3,87,539 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. సదాశివపేట, రాయికోడ్, మునిపల్లి, వట్‌పల్లి, నారాయణఖేడ్, మనూరు తదితర మండలాల్లో అధికంగా సాగు చేశారు.
అప్పటికే పత్తి పంటపై ఎకరా సాగు కోసం రూ.30 వేలకు పైగా పెట్టుబడులు పెట్టారు. తొలుత పరిస్థితి ఆశాజనకంగా ఉన్నా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలో పత్తి రైతుల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీ వర్షాలకు పత్తిపంటలు దారుణంగా దెబ్బతినడంతో పంట దిగుబడిపై ప్రభావం చూపాయి. వచ్చిన దిగుబడినైనా దక్కించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కూలీలకు అధిక రేట్లు ఓ వైపు, కూలీల కొరత మరోవైపు పత్తిరైతులను తీవ్రంగా వేధిస్తున్నాయి. పత్తితీత కోసం కిలో రూ.16 చొప్పున కూలీలకు చెల్లించాల్సి వస్తుండటంతో రైతులు నష్టాల బాట పడుతున్నారు.
వేధిస్తోన్న కూలీల కొరత
జిల్లాలో కూలీల కొరత ఉండటంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, మైబూబ్ నగర్, రంగారెడ్డి, దేవరకొండ, కర్నూల్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి ఆటోలు, ఇతర వాహనాలను ద్వారా కూలీలను తెప్పించుకుని రైతులు పత్తితీత పనులు కొనసాగిస్తున్నారు. కూలీలను ఇతర ప్రాంతాల నుంచి రప్పించేందుకు అయ్యే రవాణ ఖర్చులు కూడా రైతులే భరించాల్సి వస్తోంది. ఇక వలస కూలీలకు వారానికొకసారి దావత్ కూడా ఇవ్వవలసి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు.
రైతులకు ఈసారి కలిసిరాని పత్తి సాగు!
రూ.12 వేలు చెల్లిస్తే...
క్వింటాలు పత్తికి రూ.8,110లుగా ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించింది. ధర ఆశాజనకంగా ఉన్నా దిగుబడులు తగ్గనుండటంతో తాము నష్టపోవలసి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే క్వింటాల్‌కు రూ.12 వేలు చెల్లిస్తే నష్టాల నుంచి కొంతమేర బయట పడొచ్చని రైతులు ఆశిస్తున్నారు.
కూలీలు దొరకడం లేదు
నాలుగు ఎకరాల్లో పత్తిని సాగు చేసి రూ.లక్షకు పైగా వెచ్చించాను. పత్తితీతకు స్థానికంగా కూలీలు దొరకడం లేదు. యాసంగి పంటలపైనే ఆశలు పెట్టుకున్నాను.
–భాగన్న, రైతు మాటూర్ గ్రామం
రూ.12 వేల ధర నిర్ణయించాలి
అధిక వర్షాలతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. ప్రభుత్వం క్వింటాలు పత్తికి కనీసం రూ.12 వేలు నిర్ణయించి ఆదుకోవాలి. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడే వస్తోంది. దీంతో వెచ్చించిన పెట్టుబడులు వస్తే చాలని భావిస్తున్నాం. –గోపాల్‌రెడ్డి,
రైతు, ఖాంజమాల్‌పూర్ రాయికోడ్ మండలం
తీతలో జాగ్రత్తలు పాటించాలి
పత్తి పూత, కాత సమయాల్లో వర్షాలు అధికంగా కురవడంతో పత్తి దిగుబడి పడిపోయింది. దీంతో తీత లో రైతులు జాగ్రత్తలు పాటించాలి. పత్తికాయ నుంచి పత్తిని పూర్తిగా తీయాలి. రవాణాలో పత్తి వృథాను అరికట్టాలి. పంటకు దుమ్ముధూళీ అంటుకోకుండా చూసుకోవాలి. సూర్యోదయం అనంతరమే పత్తిని తీయాలి. పంటను ఆరబెట్టి నాణ్యతను కాపాడుకోవాలి.
–సత్యనారాయణ. ఏడీఏ రాయికోడ్.


