కారు చీకట్లో కాంతి రేఖ..!
కార్నియా సమస్యతో బాధపడే వారికి కేంద్రం శుభవార్త చనిపోయిన వ్యక్తి నుంచి నాలుగు నుంచి ఆరు గంటల్లోపు కార్నియా సేకరణ హైదరాబాద్ సరోజినిదేవి ఆసుపత్రికి తరలించి చికిత్స ఫైలెట్ ప్రాజెక్టు కింద సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి ఎంపిక
సిద్దిపేటకమాన్: కార్నియా కంటి చూపు సమస్యతో బాధపడుతున్న వారికి ఇదో శుభవార్త. తిరిగి చూపును ప్రసాదించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. పైలెట్ ప్రాజెక్టు కింద పోస్టు గ్రాడ్యుయేషన్ టీచింగ్ సదుపాయం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా సిద్దిపేట, నిజామాబాద్, ఆదిలాబాద్ మూడు ప్రభుత్వ ఆసుపత్రులను ఎంపిక చేసింది. ప్రభుత్వాసుపత్రిలో చనిపోయిన వ్యక్తి నుంచి ఆసుపత్రి ఆప్తమాలజీ విభాగ వైద్యులు కార్నియా సేకరించి హైదరాబాద్ సరోజిని దేవి కంటి ఆసుపత్రికి పంపుతారు. వాటిని అవసరమైన వారికి అమర్చి తిరిగి కంటి చూపును ప్రసాదించనున్నారు. ఇందుకోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్‌నర్సులు, వైద్యులు, సిబ్బందికి శిక్షణ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
ఆరు గంటల్లోపు కార్నియా సేకరణ
సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి వచ్చే మృతదేహాల నుంచి ఆరు గంటల్లోపు కార్నియా సేకరించి, ప్రత్యేక బాక్సులో స్టోర్ చేస్తారు. ఆర్టీసీ ద్వారా హైదరాబాద్ సరోజినిదేవి కంటి ఆసుపత్రికి తరలించనున్నారు. ఒక వ్యక్తి నుంచి సేకరించిన రెండు కార్నియాలు కంటి చూపు సమస్యతో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులకు చూపును తిరిగి తీసుకురావచ్చని ఆసుపత్రి ఆప్తమాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
స్టాఫ్ నర్సులకు అవగాహన
సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడంతో సూపరింటెండెంట్ డాక్టర్ సంగీత ఆధ్వర్యంలో ఆప్తమాలజీ హెచ్‌ఓడీ చంద్రశేఖర్ వైద్యులు, సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే ఆసుపత్రిలోని స్టాఫ్ నర్సులకు శిక్షణ ఇచ్చారు. దీంతో ఆసుపత్రిలో మృతుడి కుటుంబ సభ్యులు, వారి అటెండ్లకు కార్నియా డొనేట్ చేసేలా కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పించనున్నారు.
వైద్యులు, సిబ్బందికి అవగాహన
చనిపోయిన వ్యక్తి నుంచి ఆరు గంటల్లోపు కార్నియా సేకరించి సమస్యతో బాధపడుతున్న వారికి అమర్చడం వల్ల కంటి చూపును ప్రసాదించవచ్చు. పైలెట్ ప్రాజెక్టు కింద సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎంపికైంది. చనిపోయిన వ్యక్తి నుంచి కార్నియా దానం చేసేలా వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడానికి ఆసుపత్రి సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం.
– డాక్టర్ సంగీత, సూపరింటెండెంట్
సిద్దిపేట ప్రభుత్వాసుపత్రి


