శభాష్.. దుర్గయ్య
● బస్సులో మరిచిపోయిన 39 తులాల బంగారం బ్యాగ్ అప్పగింత ● నిజాయితీ చాటుకున్న ప్రయాణికుడికి డిపో సిబ్బంది సన్మానం
సంగారెడ్డి టౌన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు దుర్గయ్య నిజాయితీ చాటుకున్నాడు. సంగారెడ్డికి చెందిన రిటైర్డ్ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి వసుధ ప్రకాష్ భార్యాభర్తలు గురువారం సికింద్రాబాద్‌లో 39 తులాల బంగారం కొనుగోలు చేశారు. అనంతరం జూబ్లీహిల్స్ బస్టాండ్ నుంచి సంగారెడ్డికి బస్సులో తిరిగి వస్తుండగా బ్యాగ్ సీట్‌లో పడిపోయింది. అయితే అదే బస్సులో ప్రయాణిస్తున్న దుర్గయ్య అనే ప్రయాణికుడు కండక్టర్ శ్రీధర్ రెడ్డికి బ్యాగ్‌ను అందజేశాడు. వెంటనే డిపో మేనేజర్‌కు తెలియజేయగా.. సంబంధిత ప్రయాణికులకు సమాచారం అందించి సుమారు రూ.50 లక్షల విలువ చేసే 39 తులాల బంగారు బిస్కెట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా నిజాయితీ చాటుకున్న దుర్గయ్యను ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం కుటుంబ సభ్యులు అతడికి ధన్యవాదాలు తెలిపారు.


