చట్టాలపై అవగాహన అవసరం: సౌజన్య
ఝరాసంగం(జహీరాబాద్): ప్రతీ విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. మండల కేంద్రమైన ఝరాసంగం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటి బచావో–బేటి పడావో కార్యక్రమంలో భాగంగా బుధవారం అంతర్జాతీయ బాలిక దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ... విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకుని లక్ష్యాలను సాధించాలన్నారు. క్రమశిక్షణతో పాటు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, సీడీపీఓ అంజమ్మ, ఎస్సై క్రాంతి కుమార్ పాటిల్, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ నిర్మల, మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి, తదితరులు పాల్గొన్నారు.


