ఇల్లు లేని బతుకు ఇంకెందుకు..?
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
చేగుంట(తూప్రాన్): తనకు ఇల్లు లేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చేగుంట మండలం పొలంపల్లిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎరుకల ప్రవీణ్ (30)కు సొంత ఇల్లు లేకపోవడంతో గ్రామంలోని ఓ కమ్యూనిటీ భవనంలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఇందిరమ్మ ఇల్లు సైతం మంజూరు కాలేదు. ఇంటి విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇల్లు లేని బతుకు ఇక ఎందుకు అని వాపోయేవాడు. ఈ క్రమంలో ప్రవీణ్ సోమవారం బయటకు వెళుతున్నట్లు చెప్పి ఇంట్లోంచి వెళ్లాడు. ప్రవీణ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, బుధవారం స్థానిక చెరువులో ప్రవీణ్ మృతదేహం తేలింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు.


