మంజీరాలో ఎముకల గూడు లభ్యం
గల్లంతైన 50 రోజులకు ఆచూకి
కొల్చారం(నర్సాపూర్): యాభై రోజుల క్రితం మంజీరాలో గల్లంతైన మెదక్ జిల్లా కొల్చారం మండలం తుక్కాపూర్‌కు చెందిన టేక్మాల్ ప్రమీల (58) ఆచూకీ లభ్యమైంది. ఘటనకు సంబంధించి ఎస్‌ఐ మహ్మద్ మోహినొద్దీన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ప్రమీల ఆగస్టు 26వ తేదీన కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీపంలోని మంజీరా వద్దకు వెళ్లింది. ఇదే సమయంలో ఎగువ నుంచి నీటి ప్రవాహం పెరగడంతో నదిలో గల్లంతైంది. నాటి నుంచి వదర ప్రవాహం తగ్గకపోవడంతో ఆచూకీ తెలియకుండా పోయింది. నాలుగు రోజులుగా ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో చిన్నఘనాపూర్ శివారులోని మంజీరాలో ఎముకల గూడుతో ఉన్న మహిళ మృతదేహం కనిపించడంతో అటువైపుగా వెళ్లిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్‌ఐ ఎముకల గూడుపై ఉన్న చీర ఆధారంగా ప్రమీలగా గుర్తించారు. మృతురాలి కుమారుడు వీరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


