బకాయి తిరిగిరాక బలవన్మరణం
ఓ వ్యక్తికి రూ.నాలుగు లక్షలు అప్పుగా ఇచ్చిన మహిళ
జహీరాబాద్ టౌన్: అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి ఆ డబ్బును సకాలంలో ఇవ్వకపోవడంతో భర్తకు సమాధానం చెప్పలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. జహీరాబాద్ పట్టణ పరిధిలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలు ఎస్సై వినయ్ కుమార్ కథనం ప్రకారం...జహీరాబాద్ పట్టణ పరిధిలో అల్లీపూర్ షేరి నగర్‌కు చెందిన చింతల్‌గట్టు గొల్ల రాజు(38) సదాశివపేట సమీపంలోని ఎంఆర్‌ఎఫ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అవసరాల కోసం నర్సింహులు వద్ద బంగారంపై రూ.4 లక్షలు రుణం తీసుకున్నాడు. తీసుకున్న డబ్బుల్ని బ్యాంక్‌లో కట్టమని భార్య స్వప్నకు నాలుగు లక్షలు ఇచ్చాడు. అయితే ఆమె పరిచయం ఉన్న కోహీర్ మండలంలోని గురుజువాడ గ్రామానికి చెందిన శంకర్‌కు ఆ డబ్బును అప్పుగా ఇచ్చింది. విషయం భర్తకు కూడా చెప్పింది. కొన్ని రోజుల తర్వాత అప్పు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని శంకర్‌ను అడగడంతో డబ్బులు ఇచ్చేది లేదని మొండికేశాడు. దీంతో భర్తకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మానసిక వేదనకు గురైన స్వప్న బుధవారం ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


