మళ్లీ తెరపైకి!
● బడుల తనిఖీలకు టీచర్లు
● పాఠశాలల వారీగా కమిటీలు
● గతంలో వెనక్కి తగ్గిన విద్యాశాఖ
చేగుంట మండలం కరీంనగర్ స్కూల్‌లో తనిఖీ
సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్యను అందించి.. విద్యార్థుల్లో స్థాయికి తగ్గ సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా టీచర్‌ర్లతో మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత జూన్‌లోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, అప్పట్లో టీచర్లు వ్యతిరేకించడంతో అమలును నిలిపివేశారు. తిరిగి కొన్ని మార్పులతో టీచర్ కమిటీలు ఏర్పాటు చేయాల్సిందిగా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా జిల్లాలో డీఈఓ రాధాకిషన్ సారథ్యంలో ఇప్పటికే వేసిన జిల్లాస్థాయి కమిటీ రోజు వారీ తనిఖీలు జరుపుతోంది.
– మెదక్ అర్బన్
ప్రతి వంద ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఒక కమిటీ, 50 ఉన్నత పాఠశాలలకు మరో కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలు ప్రతి మూడు నెలలకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసి, ప్రతి వారం డీఈఓలకు నివేదిక అందజేయాలి. ప్రాథమిక పాఠశాలకు ప్రైమరీ హెచ్‌ఎం, ప్రాథమికోన్నత పాఠశాలకు స్కూల్ అసిస్టెంట్ నోడల్ అధికారిగా, ఇద్దరు సభ్యులు ఉంటారు. ఉన్నత పాఠశాలకు గెజిటెడ్ హెచ్‌ఎం నోడల్ అధికారిగా, ఎనిమిది మంది సబ్జెక్ట్ టీచర్లు, పీఈటీలు సభ్యులుగా ఉంటారు. పర్యవేక్షణ కమిటీ కోసం ఎంపిక చేసిన టీచర్లు కనీసం పదేళ్ల బోధన అనుభవం కలిగి ఉండాలి.
జిల్లాలో ఇప్పటికే మొదలైన తనిఖీలు
కనీస సామర్థ్యాలే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ ఇప్పటికే జిల్లాలో ఒక తనిఖీ టీంను ఏర్పాటు చేశారు. ఇందులో ఏఎంఓ, సెక్టోరియల్ అధికారులు, ఆయా మండల ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు సభ్యులుగా ఉన్నారు. ప్రతి రోజు ఒక మండలానికి వెళ్లిన టీం సభ్యులు, విడిపోయి ఒక్కొక్కరు ఒక పాఠశాలకు వెళ్తున్నారు. విధిగా ప్రార్థనలో ఉండి, మద్యాహ్నం వరకు ఈఎల్‌ఎం అమలు తీరును పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, గణితంలోని చతుర్విద ప్రక్రియలు వస్తున్నాయా..? లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. పాఠ్య పుస్తకాలతో పాటు అభ్యాస దీపికల వినియోగాన్ని గమనిస్తున్నారు. టీచింగ్ డైరీ, పీరియడ్ ప్లాన్స్, టీఎల్‌ఎం వాడకం తీరును చూస్తున్నారు. అయితే ఎండ్‌లైన్.. బేస్‌లైన్ టెస్ట్‌లలో టీచర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని తెలుస్తుంది. పలుచోట్ల బేస్‌లైన్ టెస్ట్‌లను మూల్యాంకనం చేయడం లేదని సమాచారం. ఎండ్‌లైన్‌లో 40 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు, బేస్‌లైన్‌లో 6 శాతం చూపడం దీనికి నిదర్శనంగా భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మూడు మండలాల్లో జిల్లా టీంలు తనిఖీలు నిర్వహించారు.


