స్కూటీలో నుంచి నగదు చోరీ
జహీరాబాద్ టౌన్: పట్ట పగలే గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీలో నుంచి నగదు అపహరించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన అంజయ్య ఎస్‌బీ ఐ బ్యాంక్ నుంచి మంగళవారం రూ.3.17 లక్షలు డబ్బు డ్రా చేసుకుని బయట పార్కింగ్ చేసిన స్కూటీ డిక్కీలో పెట్టి మళ్లీ లోపలికి వెళ్లి వచ్చారు. బ్యాంక్ పని పూర్తయ్యాక స్కూటీ డిక్కీ తెరిచి ఉండడంతో అందులోని నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని గుర్తించారు. బాధితుడు జహీరాబాద్ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వినయ్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మందుబాబులకు జరిమాన
సంగారెడ్డి క్రైమ్: డ్రంకెన్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులకు జిల్లా న్యాయస్థానం జరిమాన విధించింది. సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి పట్టణంలోని పాత బస్టాండ్, పోతిరెడ్డిపల్లి చౌరస్తా, బైపాస్‌లోని గుర్రపు బొమ్మ వద్ద నిర్వహించిన డ్రంకెన్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఎనిమిది మందిని అదుపు లోకి తీసుకున్నట్లు చెప్పారు. వారిని బుధ వారం కోర్టులో హాజరుపరచగా అదనపు న్యాయమూర్తి షకీల్ అహ్మద్ సిద్దిఖీ.. ముగ్గురికి రూ.1,500, మిగతా ఐదు మందికి రూ.1,000, చొప్పున జరిమాన విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్గొన్నారు.
రోడ్డు ప్రమాదం..
ఇద్దరికి గాయాలు
నిజాంపేట(మెదక్): నిజాంపేట మండలంలో ని నందిగామ శివారులో బుధవారం ఆటో, బైక్ ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. వివరా ల ప్రకారం.. మండలంలోని ఎంపీడీఓ కార్యా లయంలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్, ఫారెస్ట్ ఆఫీసర్ మహేశ్ బైక్‌పై రామాయంపేట నుంచి నిజాంపేటకు వస్తున్న క్రమంలో ఆటో ఎదురుగా వచ్చి బైక్‌ను ఢీకొట్టడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రెండు ఆవుల అపహరణ
కల్హేర్(నారాయణఖేడ్): మండలంలోని ఫత్తేపూర్‌లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెండు ఆవులు అపహరించారు. గ్రామానికి చెందిన హన్మంత్, గాండ్ల పండరికు చెందిన పశువులను ఇంటి ఎదుట కట్టేశారు. ఉదయం చూసేసరికి ఆవులు కనిపించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నీట మునిగి వ్యక్తి మృతి
మంజీరాలో మోటారు తీస్తుండగా ప్రమాదం
పాపన్నపేట(మెదక్): మంజీరా నదిలో విద్యుత్ మోటారును తీసేందుకు వెళ్లి నీట మునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘట న కుర్తివాడలో బుధవారం వెలుగు చూసింది. ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆబిద్ (53) వ్యవసాయంతో పాటు, ఆటో నడుపు కొంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంజీరా నది దగ్గర ఉన్న తన పోలానికి ,నీరందించే విద్యుత్ మోటారు పైప్‌లైన్ ఊడిపోయింది. దాన్ని బిగించేందుకు మంగళవారం సాయంత్రం వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. బుధవారం ఉదయం అతని మృతదేహం దొరికింది. కేసు దర్యాప్తులో ఉంది.
చికిత్స పొందుతూ
విద్యార్థిని మృతి
కొండపాక(గజ్వేల్): విద్యార్థిని మల్లం మేఘన(14) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుకునూరుపల్లి ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం కుకునూరుపల్లికి చెందిన మేఘన రోజూ లాగానే 6వ తేదీన పాఠశాలకు వెళ్లింది. అయితే సర్టిఫికెట్ మర్చిపోవడంతో స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చింది. తిరిగి పాఠశాలకు వెళ్తున్న క్రమంలో రాజీవ్ రహదారిని దాటుతుండగా హైదరాబాద్ వైపు బుల్లెట్‌పై వెళ్తున్న కోతి అనిల్ ఢీ కొట్టాడు. దీంతో తలకు గాయాలై కోమాలోకి వెళ్లింది. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఆమె తండ్రి ఐలయ్య ఫిర్యాదు మేరకు కోహెడ మండలంలోని తీగలకుంటపల్లికి చెందిన అనిల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ట్రాక్టర్ ఢీకొని
ఆర్టీసీ డ్రైవర్‌కు గాయాలు
అక్కన్నపేట(హుస్నాబాద్): ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన అక్కన్నపేట మండలం కుందనవానిపల్లిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ చాతరాజు ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వెల్ధండి సంపత్‌రాజు ఆర్టీసీ డ్రైవర్. రోజు మాదిరిగానే డ్యూటీకి తన ద్విచక్రవాహనంపై హుస్నాబాద్‌కు వెళుతున్నాడు. ఈ క్రమంలో గ్రామ శివారులో వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో సంపత్‌రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో 108 అంబులెన్స్ సహాయంతో హుస్నాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


