ఎవరిది ఈ చెత్త ఐడియా..!
చెత్త సేకరించేది మున్సిపల్ కార్మికులు అమ్ముకునేది ప్రైవేట్ ఏజెన్సియా..? ఖర్చంతా మున్సిపాలిటీదైనా నయా పైసా లాభం లేదు ఒప్పందం వెనుక ఆంతర్యమేమిటో..! అధికారుల తీరుపై విమర్శల వెల్లువ
సొమ్ము ఒకరిదైతే.. సోకు మరొకరిది అన్నట్లుందీ హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిస్థితి. కష్టం కార్మిలకుదైతే.. కాసులు మాత్రం ప్రైవేట్ ఏజెన్సీ జేబుల్లోకి వెళుతున్నాయి. చెత్త సేకరణ ప్రక్రియకు సంబంధించి ఖర్చంతా భరిస్తున్న మున్సిపాలిటీకి నయా పైసా ప్రయోజనం చేకూరడం లేదు. ఈ ‘చెత్త’ఐడియా మున్సిపల్ అధికారులకు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని పట్టణ ప్రజలు విస్మయం చెందారు.
హుస్నాబాద్: మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు నిత్యం ఇళ్ల నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తారు. తడి చెత్తను వేరు చేసి అక్కడే సేంద్రియ ఎరువుగా మారుస్తుంటే.. పొడి చెత్తను ఓ స్వచ్ఛంద సంస్ధ సొమ్ము చేసుకుంటోంది. తడి, పొడి, హానికర చెత్తను వేరుచేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మున్సిపల్ అధికారులు, బసిల్ ఫౌండేషన్ తెలంగాణ స్వచ్ఛంద సంస్ధతో ఒప్పందం చేసుకున్నారు. హుస్నాబాద్ పట్టణంలో ప్రతి రోజు 10 ఆటోలు, ఒక ట్రాక్టర్ ద్వారా పారిశుద్ధ్య కార్మికులు చెత్తను సేకరిస్తున్నారు. మొత్తం 26 మంది కార్మికులు పని చేస్తున్నారు. ప్రతి నెల 195 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఇందులో 20 టన్నుల పొడి చెత్తను వేరు చేసి, మిగతా తడి చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేస్తున్నారు. పొడి చెత్తను అమ్ముకునేందుకు మహిళా సంఘాలకు అప్పగించాల్సి ఉండగా, ఐదేళ్ల వరకు బసిల్ ఫౌండేషన్‌కు అప్పగించారు.


