ఆశలన్నీ కొనుగోలు కేంద్రాలపైనే
అకాల వర్షాలతో ఓవైపు పంటలు దెబ్బతినగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. స్వల్పకాలిక వానాకాలం పంటలు చేతికొస్తున్నాయి. ఇప్పటికే పెసర, మినుము పంటలు కోతలు కోసి రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం సోయాబీన్ పంట దిగుబడులు ప్రారంభమైన నేపథ్యంలో ఈ పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా మారనుంది. బయట మార్కెట్‌లో, దళారుల వద్ద పంటలకు మద్దతు ధర లభించడంలేదు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు.
– నారాయణఖేడ్:
తగ్గిన పంట దిగుబడి
జిల్లాలో 67,676 ఎకరాల్లో సోయాబీన్ పంటను రైతులు సాగు చేశారు. పెసర పంట 12,116 ఎకరాలు, మినుము 9,688 ఎకరాల్లో సాగు చేశారు. అకాల వర్షాల వల్ల పెసర, మినుము పంటలు 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడులు రావాల్సి ఉండగా కేవలం 3 క్వింటాళ్ల వరకే దిగుబడులు వచ్చాయి. సోయాబీన్ ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్లు దిగుబడులు రావాల్సి ఉండగా 4 నుంచి 6 క్వింటాళ్ల వరకే దిగుబడులు వస్తున్నాయి. ప్రభుత్వం సోయాబీన్ క్వింటాల్‌కు రూ.5,328 మద్దతు ధరను ప్రకటించింది. గతేడాది ఈ పంటకు 4,892 మద్దతు ధర ఉండగా ఈసారి 8.9% మద్దతు ధర పెంచారు. పెసర రూ.8,682లు గతేడాది ఉండగా 1% పెంచి ఈ ఏడు రూ.8,767లు, మినుము గతేడాది రూ.7,400 చెల్లించగా 5.4% పెంచి రూ.7,800 చొప్పున మద్దతు ప్రకటించింది. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో రైతులకు ప్రయోజనం చేకూరాల్సి ఉండగా ప్రస్తుత మార్కెట్‌లో పెసర, మినుము పంటలను దళారులు రూ.6వేల నుంచి రూ.7వేల లోపే చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.
వర్షాలతో తడిసిన పంటలు..
కాగా ఈసారి భారీగా, ఏకధాటిగా వర్షాలు కురవడంతో చేలల్లో నీళ్లు నిలిచి పంటలు బాగా దెబ్బతిన్నాయి. దిగుబడులపై తీవ్ర ప్రభావం పడటంతో రైతులకు పెట్టుబడులు కూడా దక్కలేదు. మార్కెట్‌లో తడిసిన పంటలకు ధర లేకపోవడంతో మరింత నష్టపోతున్నారు. ప్రభుత్వం తడిసిన, రంగుమారిన పంటను కొనుగోలు చేయదు. దీంతో రైతులకు దళారులే దిక్కయ్యారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి తడిసిన పంటను కొనుగోలు చేసిన పక్షంలో రైతుల ప్రయోజనం కలిగేది. సోయాబీన్ పంట నూర్పిళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లాలో నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాల్లో అధికంగా పప్పుదినుసు పంటలు సాగవుతాయి. పంట విస్తీర్ణం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
కోతలు ప్రారంభమైన సోయాబీన్
కానరాని కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
పెసర, మినుము దళారులపాలు


