మున్సిపాలిటీలతోనే మెరుగైన పాలన
పటాన్‌చెరు: గ్రామ పంచాయతీల కంటే మెరుగైన పరిపాలన మున్సిపాలిటీల ద్వారా సాధ్యమవుతుందని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన కార్యదర్శి శ్రీదేవి పేర్కొన్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పౌర సేవ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో కలిసి ఆమె మంగళవారం ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...పటాన్‌చెరు నియోజకవర్గంలో పరిపాలన సౌలభ్యం, సమీకృత అభివృద్ధి కోసం నూతనంగా ఐదు మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ.15కోట్ల చొప్పున నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 2047 విజన్ ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రతీ ఒక్కరు పౌర సేవ కేంద్రాలను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ...రాబోయే తరాలకు మెరుగైన సౌకర్యాలు, అభివృద్ధితో కూడిన పట్టణాలను అందించాలన్న లక్ష్యంతోనే గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసిందన్నారు. నూతన మున్సిపాలిటీలకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి ఫాల్గుణ కుమార్‌లు మాట్లాడారు. కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకట కిషన్‌రావు, మున్సిపల్ సిబ్బంది, మాజీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్ర మున్సిపల్ పరిపాలన
కార్యదర్శి శ్రీదేవి
ఇస్నాపూర్ మున్సిపాలిటీలో
పౌర సేవ కేంద్రం ప్రారంభం


