వైద్యకళాశాలలో మైదానం ఏర్పాటు
సంగారెడ్డి: జిల్లా కేంద్రం సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన క్రీడా మైదానం ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం కలెక్టర్ పర్యటించారు. రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జీజీహెచ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపును కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇక్కడ ఏర్పాటు కానున్న మైదానంలో క్రికెట్ ప్రాక్టీసింగ్ నెట్ కోర్టులు, వాలీబాల్ కోర్ట్, త్రోబాల్ కోర్టు, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలకు అనువైన మల్టీపర్పస్ ప్లే గ్రౌండ్ రూపకల్పన చేయాలని జిల్లా క్రీడా అధికారి ఖాసీం బేగ్‌కు సూచించారు.
సదరం క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలి
సదరం క్యాంపులు వారానికి మూడు రోజులు ఏర్పాటు చేయడం జరుగుతుందని వాటిని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సదరం క్యాంప్‌నకు వచ్చే దివ్యాంగులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సదరం క్యాంపులో పాల్గొనడానికి ఇప్పటివరకు 1,249 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు.
కలెక్టర్ ప్రావీణ్య
జిల్లా ఆస్పత్రి, వైద్యకళాశాల సందర్శన


