ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నిక
నారాయణఖేడ్: ప్రజాస్వామ్య పద్ధతిలో కార్యకర్తల అభిప్రాయం మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఆ పార్టీ జిల్లా పరిశీలకురాలు సిజరిట పేర్కొన్నారు. ఖేడ్‌లోని సాయిబాబా ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల అభిప్రాయ సేకరణ సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుకూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిజరిట మాట్లాడుతూ...ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు పార్టీలో తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. కార్యకర్తలు అందరి సమష్టి కృషి కారణంగానే రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందని తెలిపారు. ఇదే ఐక్యతలో కార్యకర్తలు ఉండాలని స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుడి వచ్చిన దరఖాస్తుల్లో వడపోత నిర్వహించి ఆరుగురి పేర్లు అధిష్టానానికి పంపిస్తామని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు అందరినీ కలుపుకుపోయే వ్యక్తికి బాధ్యతలు అప్పగించడం జరుగుతుందన్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం డీసీసీ అధ్యక్షుడి బాధ్యతగా ఉంటుందన్నారు. ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డిలు మాట్లాడుతూ..కార్యకర్తల సమష్టి కృషి ఫలితంగానే తాము విజయం సాధించామని, స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లో కాంగ్రెస్ జెండాలను ఎగరేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు నగేశ్ షెట్కార్, డీసీసీ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్, శంకరయ్యస్వామి, రషీద్, ఆనంద్ స్వరూప్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పరిశీలకురాలు సిజరిట
అధిష్టానానికి ఆరుగురి పేర్లు


