భూ నిర్వాసితులకు ఇంటి స్థలం కేటాయించాలి
ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు
కొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని అలియాబాద్, తొగర్‌పల్లి గ్రామాలలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వ హామీ మేరకు ఇంటి స్థలం కేటాయించాలని ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు విజ్ఞప్తి చేశారు. బాధిత రైతులకు ఇంటి స్థలానికి సంబంధించి పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ టీజీఐఐసీ చైర్మ్‌న్ నిర్మలారెడ్డి, కొండాపూర్ మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డితో కలసి మంగళవారం కలెక్టర్ ప్రావీణ్యను కలిశారు. . ఈ సందర్భంగా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రైతులు కొన్నేళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారని, వారికి తక్షణమే ఇంటి స్థలం మంజూరు చేసి పట్టాలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా తొగర్‌పల్లిలో ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం పాఠశాల భవనం పాడుబడిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు కలెక్టర్‌కు వివరించారు. అనంతరం నిర్మలారెడ్డి మాట్లాడుతూ...కొండాపూర్ మండలంలోని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు కలెక్టర్ సానుకులంగా స్పందించారు.


